ముకరంపుర, ఏప్రిల్ 3: ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన వనాలు ఆకురాల్చడంతో అటవీ జంతువులు తమ స్థావరాలను వీడి ఆగమవుతున్నాయి. నీళ్లు, ఆహారం కోసం వనాలను దాటి బయటకు వచ్చి దారి తప్పుతూ ఊళ్లల్లోకి వస్తున్నందున అటవీ శాఖ అప్రమత్తమైంది. ఇటీవల కాలంలో శాతవాహన విశ్వవిద్యాలయంతో పాటు రేకుర్తిలో గుడ్డెలుగులు సంచరించడంతో అందరిలో భయం నెలకొంది. అయితే, జనం ఆందోళనకు గురై వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. సత్వరమే అటవీ శాఖకు సమాచారం అందిస్తే… వాటిని సురక్షితంగా పట్టుకొని తిరిగి అడవుల్లో వదిలిపెట్టేలా నిత్యం అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి తెలిపారు. వేసవిలో అటవీ జంతువుల దాహం తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అటవీ ప్రాంతంలో చెక్ డ్యాంల నిర్మాణం
అటవీ ప్రాంతంలో సంచరించే వివిధ రకాల వన్యప్రాణులు, మృగాల దాహం తీర్చేలా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా వానాకాలంలో గుట్టలు, ఎత్తయిన ప్రాంతాల నుంచి వృథాగా పోయే వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టేలా అటవీ శాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టారు. పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యాంలు నిర్మించారు. వరద ప్రవాహ మార్గాలు, నీటి కోసం అటవీ జంతువులు సంచరించే మార్గాలను శాస్త్రీయంగా గుర్తించి చెక్‌డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంక్‌ల నిర్మాణాలు చేపట్టారు. నీళ్లు అందుబాటులో ఉండడంతో అడవిని దాటి జంతువులు బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఇలా ఫిబ్రవరి వరకు చెక్‌డ్యాంలు వన్యప్రాణుల దాహార్తీని తీరుస్తున్నాయి. జిల్లాలోని రెండు అటవీ రేంజ్‌లు అయిన కరీంనగర్, హుజూరాబాద్‌లో ఇప్పటికే 6 చెక్ డ్యాంలు ఉండగా, కొత్తగా మరో రెండు నిర్మించారు.
సాసర్ పిట్, సిమెంట్ కుండీల్లో నీటి నిల్వ
మార్చి నుంచి ఎండ తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో అటవీ ప్రాంతాల్లోని సహజ నీటి వనరులు అడుగంటి పోతాయి. చెక్‌డ్యాంలు సైతం వట్టిపోయి అటవీ జంతువులకు ఇబ్బందికరంగా మారుతుంది. దట్టమైన పొదలు, వృక్షాలు సైతం ఆకురాల్చడంతో సరైన ఆహారం లభించని పరిస్థితి ఉంటుంది. గుడ్డెలుగులతో పాటు జింకలు, నక్కలు, హైనాలు, ఇతర వన్యప్రాణులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. జంతువులు సంచరించే మార్గాల్లో సాసర్ పిట్(నీటి తొట్టీ)లు, సిమెంట్ గాజులతో నిర్మాణాలు చేపట్టారు. రెండు రేంజ్‌ల పరిధిలో 6 సాసర్పిట్లు, 4 సిమెంట్ గాజులతో కుండీలు నిర్మించారు. వీటిలో ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతుండడంతో వన్యప్రాణులు, పక్షులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్
ఈ నెలతో పాటు మే మాసంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అడవుల్లో వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం స్థావరాలను విడిచి బయటకు వస్తుంటాయి. వన్యప్రాణులు కనిపిస్తే స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఇందుకోసం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-5364 ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేస్తే జిల్లా స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారు.
సిబ్బందిని అప్రమత్తం చేసినం
జిల్లాలో జనావాసాల్లో గుడ్డెలుగులు సంచరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అందరినీ అప్రమత్తం చేసినం. వచ్చే నెలలోనూ ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అటవీ, గుట్టల సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణ వాసులను అప్రమత్తం చేస్తూ అధికారులు అవగాహన కల్పిస్తున్నరు. అటవీ ప్రాంతాల్లోని సాసర్పిట్లు, కుండీల్లో నీళ్లు నిల్వ ఉంచుతున్నం. రైతులు పాడి పశువులను చేల వద్ద కాకుండా తమ ఇండ్ల వద్దనే కట్టేయాలి. అటవీ జంతువులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాటి వెంటపడి గాయపర్చడం వంటి చర్యలకు పాల్పడవద్దు.
– బాలమణి, డీఎఫ్‌వో, కరీంనగర్