తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 3: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల మండల శాఖ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పేదల వైద్యులు ఆర్ఎంపీలు అని కొనియాడారు. పల్లెల్లో ప్రజలకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా మొదట ఆర్ఎంపీలే ప్రాథమిక చికిత్స అందిస్తారన్నారు. గ్రామాల్లో మూఢనమ్మకాల నిర్మూలనకు ఆర్ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. డబ్బులు ఇచ్చినా, ఇవ్వకున్నా.. జబ్బు వచ్చిందని వస్తే సేవలందిస్తారని అభినందించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సంఘ భవనాలు నిర్మించినట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని మానసిక రోగులకు కూడా ఆర్ఎంపీలు చికిత్స చేయాల్సిన అవసరం ఉందని చురుకలంటించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీలు తమ సమస్యలను విన్నవించగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సంఘ భవనానికి అడగ్గానే స్థలం ఇచ్చిన ఎడ్ల జోగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఆర్ఎంపీలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ నీలమ్మ, ఎంపీటీసీ వేల్పుల మమత, ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతుల మనోహర్, ప్రధాన కార్యదర్శి నర్సింహారాజు, మండలాధ్యక్షుడు కళ్లెం రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంకెర్ల శ్రీనివాస్, ప్రతినిధులు కాసం రవీందర్‌రెడ్డి, కొండ స్వామి, కే ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.