వేములవాడ, ఏప్రిల్ 3: రాజన్న క్షేత్రానికి త్వరలో సీఎం కేసీఆర్ రానున్నారని, వేములవాడ పట్టణం, రాజన్న క్షేత్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో రూ. 1.35కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పూర్తయినందున సీఎం కేసీఆర్ వేములవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, రాజన్న ఆలయంతోపాటు పట్టణాభివృద్ధి సమాంతరంగా జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణాభివృద్థి కోసం రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో పనుల ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, రూ.25కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పట్టణంలో ఇల్లు లేని పేదలు 1800మంది ఉన్నారని, వీరిలో 800 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, సొంత ఇంటి స్థలం ఉన్న మరో 800 మందికి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, కమిషనర్ శ్యామ్‌సుందర్ రావు, వార్డు కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేశ్, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, మాజీ సెస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జెడల శ్రీనివాస్, నాయకులు పీచర భాస్కర్ రావు, యాదగిరి ప్రసాద్‌రావు, పొలాస నరేందర్, నామాల లక్ష్మీరాజం, గూడూరి మధు, నీలం శేఖర్, కొండ కనకయ్య, కర్ల శేఖర్, రాజేశం, నరాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.