గోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి.. బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2021-22లో 65.02 మిలియన్ టన్ను ఉత్పత్తి సాధించింది. 70 మిలియన్ టన్నులు లక్ష్యం నిర్ణయించగా, అనేక అవాంతరాలు.., సమ్మెలు జరిగినా బొగ్గు వెలికితీతలో దూసుకుపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన 64.40 మిలియన్ టన్నులు ఇప్పటివరకు రికార్డు ఉండగా, దానిని అధిగమించింది. గడిచిన కొన్నేళ్లుగా సింగరేణిలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. 2012-13లో 53.19 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి 2013-14లో 50.47 మిలియన్ టన్నులు.., 2014-15లో 52.54 మిలియన్ టన్నులు.., 2015-16లో 60.38 మిలియన్ టన్నులు.., 2016-17లో 61.34 మిలియన్ టన్నులు.., 2017-18లో 62.01మిలియన్ టన్నులు.., 2018-19లో 64.40 మిలియన్ టన్నులు, 2019-20లో 64.02మిలియన్ టన్నులుగా నమోదైంది.
గతేడాది కేవలం 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. సింగరేణి సంస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కార్మికులు గత డిసెంబర్ 9,10,11 తేదీల్లో 3 రోజుల సమ్మె నిర్వహించడం.., మార్చిలో 29, 30 తేదీల్లో 48 గంటల సమ్మె నిర్వహించడం వల్ల సంస్థ దాదాపు 1 మిలయన్ టన్ను బొగ్గు ఉత్పత్తి కోల్పోయింది. 66 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి సాధించేదని అధికారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా సంస్థ ఈసారి సాధించిన భారీ ఉత్పత్తితో పాటు సంస్థ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డు లాభాలను మూటగట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీరాంపూర్ డివిజన్‌లోనే అత్యధికం..
ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి శ్రీరాంపూర్ డివిజన్‌లోనే అత్యధికమని, మునుపెన్నడూ లేనివిధంగా ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం సురేశ్ తెలిపారు. తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 79 శాతం.., ఇందారం ఓసీపీలో 125 శాతం ఉత్పత్తి సాధించామని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియా భూ గర్భ గనుల్లో 108 శాతంతో రికార్డు నెలకొల్పినట్లు తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాకతకు కృషి చేసినవారిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో 450 మంది కార్మికులు అధనంగా ఉన్నప్పటికీ ఇదే ఏ రియాల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఎస్వోటూ జీఎం కే హరినారాయణ గుప్తా, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, డీవైజీఎం గోవిందరాజు, డాక్టర్ రమేశ్‌బాబు, పీఎం కాంతారావు, ఈఈ కుమార్ పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే..
ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో కార్మికులు, అధికారుల కృషి ఎంతో ఉందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. ఈ ఉత్పత్తి సాధనలో ముఖ్యంగా కేకే-1, కేకే-5 గనులతో పాటు కేకే ఓసీ, ఆర్కేపీ ఓసీ ప్రతిభ ఎంతో ఉందన్నారు. ఆ గనుల, ఓసీల అధికారులు, కార్మికులకు అభినందనలు తెలిపారు. 2022-23లో 54.50 లక్షల టన్నులు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, ఏజీఎం ఎస్కే ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఏజీఎం ఈఅండ్ఎం రాంమూర్తి, పీఎం వర ప్రసాద్, ఐఈడీ డీజీఎం రాజన్న, ఏజెంట్లు రాజేందర్, రాంచందర్, సీనియర్ పీవో మైత్రేయ బంధు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం..
గోలేటి ఓసీపీ ప్రారంభమైతే బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం వస్తుందని జీఎం సంజీవరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఉత్పత్తిపై సమావేశం నిర్వహించారు. ఏరియా డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, డీజీఎం(ఐఈడీ) యోహానా, పర్సనల్ మేనేజర్ ఐ లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి, సీనియర్ పీవో కిరణ్ ఉన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాం..
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే భూపాలపల్లి ఏరియాలో ఈ ఏడాది 4 లక్షల టన్నులు అదనంగా బొగ్గు ఉత్పత్తి సాధించి, మెరుగైన ఫలితాలు సాధించామని ఏరియా జీఎం టీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని అధికారులు, కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది 49.60 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏజీఎం(ఐఈడీ) జ్యోతి, ఏరియా అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, ఫైనాన్స్ మేనేజర్ ఎం అనురాధ, సీనియర్ పీవో పీ రాజేశం పాల్గొన్నారు.
రికార్డుల పరంపర కొనసాగాలి..
పీకేవోసీ రి కార్డుల పరంపర కొనసాగాలని ఏరియా జీఎం జక్కం రమేశ్ అన్నారు. లక్ష్యాలను అధిగమించిన పీకేవోసీ, మణుగూరు ఓసీ గనుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులను అభినందించారు. ప్రశంసాపత్రాలు అందించి సన్మానించారు. పీకేఓసీ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతిగౌడ్ అధ్యక్షతన జరిగి న కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉ పాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.