విద్యానగర్, ఏప్రిల్ 1: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే గానీ ఆపరేషన్లు చేయవద్దని నిర్దేశించారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ట్రై ఏజ్ గది, గైనిక్ అండ్ నాటల్ ఓపీ, ఏఎన్సీ- 2, 3, పిల్లల టీకా గది, మిడ్ వైఫ్ లైఫ్ కేర్ యూనిట్, సానింగ్ రూం, లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్, బర్తింగ్ యూనిట్, ఓటీ కాంప్లెక్స్, తదితర విభాగాలను తనిఖీ చేశారు. గర్భిణులు, రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి కలెక్టరేట్లో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల వైద్యాధికారులతో సమీక్షించారు. ఆయాచోట్ల ఆమె మాట్లాడుతూ తల్లీబిడ్డల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలన్నారు. పుట్టిన శిశువులకు తల్లిపాలు పట్టేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు.
ముర్రుపాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. కరీంనగర్‌ను క్షయ, రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ప్రజలు గ్రామీణ, అర్బన్ పీహెచ్‌సీల్లో అందుతున్న టెలీ కన్సల్టెన్సీ సేవలను సద్వినియోగం చేసుకొనేలా చూడాలన్నారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామని, ఇదే స్ఫూర్తితో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వోలు డాక్టర్ జూవేరియా, డాక్టర్ సుధీరా, కరీంనగర్ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ జ్యోతి, ఎంసీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ అలీమ్, వైద్యులు మంజుల, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ విప్లవశ్రీ, నర్సింగ్ సూపరింటెండెంట్లు అంజమ్మ, సులోచన, సరళ, తదితరులు పాల్గొన్నారు.