మానకొండూర్, మార్చి 22: మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై వ్యక్తిగత దూషణలు చేసిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు జరిగి మూడేళ్లు గడిచిన తర్వాత డీసీసీ అధ్యక్షుడికి నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో దవాఖాన నడుపుతూ కోట్లు దండుకుంటున్న కవ్వంపల్లికి నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. దవాఖానలో పేషెంట్లు లేనప్పుడు కాలక్షేపానికి నియోజకవర్గానికి వచ్చి రెండు మూడు ప్రెస్మీట్లు పెట్టి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే రసమయి గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.18 కోట్లు, షాదీముబారక్ ద్వారా రూ. 84 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2 కోట్ల 30 లక్షలు, రైతు బీమా ద్వారా రూ. 7.5 కోట్లు, రైతు బంధు ద్వారా రూ. 37 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా 40 వేల మంది లబ్ధిదారులకు రూ. 8 కోట్లు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించినట్లు వెల్లడించారు. మానకొండూర్-అన్నారం రోడ్డు పనులు టెక్నికల్ సమస్యలతో నిలిచిపోయాయని, వచ్చే నెలలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పక్షాన కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 60వేలకు పైగా టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం ఉంటే గ్రామాల్లో కనీసం కార్యకర్తలు కూడా కరువైన పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఇకపై కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, మానకొండూర్ సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం కిరణ్‌గౌడ్, వాల ప్రదీప్‌రావు, పడాల శంకరయ్య, పిట్టల మధు, బొల్లం శ్రీనివాస్, నెల్లి మురళి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, గడ్డి గణేశ్, ఆంజనేయులు, దండబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.