ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి
20 వేల మంది విద్యార్థులు హాజరు
సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలగాణ) : గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన రెండు రోజుల మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ జాబ్‌మేళాను ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ప్రారంభించారు. దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం జాబ్‌మేళాకు హాజరైట్లు ఆ యూనివర్సిటీ ప్లేస్మెంట్ అఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. సాల్వెక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్ఎస్డీసీ), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)తో కలిసి జేఎన్టీయూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 150 కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీలలో దాదాపు 10 వేలకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలు పొందడానికి 20 వేలకు పైగా నిరుద్యోగ యువత పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్థన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఎస్ఎస్డీసీ సీఈవో పీ లక్ష్మీరావు, యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ డైరెక్టర్ ఎస్ తారా కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఫర్ స్టేట్ ఎస్ వేణుగోపాలచారి ప్రత్యేకంగా పాల్గొన్నారు. అయితే బుధవారం కూడా జాబ్‌మేళా కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్య లో హాజరు కావాలని జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీ పిలుపునిచ్చారు.