ఒకప్పుడు తరగతి గదుల నిండుగా విద్యార్థులతో కళకళలాడి, కాలక్రమేణా స్టెంత్ లేక మూతపడిన సాయంపేట ప్రాథమిక పాఠశాల మళ్లీ పునర్జీవం పోసుకున్నది. మూడేళ్లుగా తాళంతోనే దర్శనమిచ్చిన విద్యాలయం, అప్పటి ఉపాధ్యాయుడు కృషితో బతికింది. ఆంగ్ల మాధ్యమ బోధనతో పునఃప్రారంభమైన కొద్దిరోజులకే పూర్వవైభవం సంతరించుకున్నది.
ధర్మారం, మార్చి12: సాయంపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు 30 నుంచి 40 మంది పిల్లలతో కళకళలాడేది. గ్రామంలోని పిల్లలంతా పాఠశాలకే వచ్చేవారు. తెలుగు మాధ్యమంలో బోధన జరిగేది. అయితే రానురాను ఆంగ్ల మాధ్యమంపై పిల్లల తల్లిదండ్రులు మక్కువ చూపడం, పిల్లలను మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడంతో కళతప్పింది. ఒకరి తర్వాత ఒకరు అంతా ప్రైవేట్‌కు వరుస కట్టడడంతో 2009లో మూతపడింది. ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించారు. అలా 2012 దాకా మూడేళ్లుగా తాళంతోనే ఉంది. పిల్లలను పంపించాలని విద్యాశాఖ అధికారులు గ్రామస్తులతో మాట్లాడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆంగ్ల మాధ్యమం ఉంటేనే బడికి పంపిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పడంతో ఏం చేయలేకపోయారు.
గోపాల్‌రావుపేటకు చెందిన ఉపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ బడి పునఃప్రారంభానికి చొరవ చూపారు. గతంలో ఆయన బొట్లవనపర్తి యూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. రోజూ సాయంపేట మీదుగానే బొట్లవనపర్తికి వెళ్లేవారు. ఈ క్రమంలో బడి ముగిసిన తర్వాత శ్రీనివాస్ సాయంపేటలో ఆగి స్కూల్ పునఃప్రారంభం గురించి తల్లిదండ్రులతో చర్చించేవారు. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని, పిల్లలకు తానే పుస్తకాలు కొనిస్తానని ఇటు తల్లిదండ్రులకు చెప్పి, అటు అధికారులతో మాట్లాడి 2012 జూన్ 12న స్కూల్‌ను తెరిపించారు. సదరు టీచర్ బొట్లవనపర్తి నుంచి సాయంపేట బడికి డిప్యూటేషన్‌పై రాగా, పిల్లల చేరిక మొదలైంది. శ్రీనివాస్‌కు తోడుగా మరో టీచర్‌ను కూడా ప్రభుత్వం నియమించడంతో స్కూల్ ప్రారంభమైన కొద్దిరోజులకే పిల్లల సంఖ్య 45కు పెరిగింది. కాగా, స్కూల్లో ఉండగానే శ్రీనివాస్‌ను ఇన్చార్జి హెచ్ఎంగా నియమించారు. ఆయన కృషితో దిగ్విజయంగా నడుస్తున్నది. ప్రస్తుతం స్కూల్లో 38 పిల్లలు విద్యభ్యసిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అదనపు తరగతి గదులను మంజూరు చేయించారని, మరో 2 గదుల నిర్మాణం జరుగున్నతదని సర్పంచ్ నెల్లి సాయి కుమార్ తెలిపారు. ‘మన ఊరు- మన బడి’ అమల్లోకి వస్తే బడి రూపురేఖలు మారుతాయని చెబుతున్నారు. తన కూతురు స్వప్నికను ఈ బడికే పంపిస్తున్నారు. కాగా, ఇటీవల హెచ్ఎం శ్రీనివాస్ తాత్కాలికంగా కరీంనగర్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
మూతపడిన బడిని తెరిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశా. అటు తల్లిదండ్రులు, ఇటు అధికారులను ఒప్పించి ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశ పెట్టి తెరిపించా. ప్రారంభమైన కొద్దిరోజులకే ఎప్పటిలాగే పిల్లలతో కళకళలాడుతున్నది. దాదాపు ఊళ్లోని పిల్లలంతా స్కూల్‌కే వస్తున్నరు. స్కూల్ ‘మన ఊరు-మనబడి’ కింద ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. పరస్పర బదిలీపై మళ్లీ ఈ బడికి వచ్చి కొత్త పాఠశాల భవన నిర్మాణంలో నా వంతు సహకారం అందిస్తా.
– జాడి శ్రీనివాస్, పూర్వ ఇన్చార్జి హెచ్ఎం