తిమ్మాపూర్ రూరల్, మార్చి12: వేల ఏండ్ల చరిత్ర కలిగిన నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే జాతరకు జిల్లాతో పాటు పక్కల రాష్టాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, నృసింహుడి నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
వేల ఏళ్ల చరిత్ర..
నల్లగొండలో నృసింహ స్వామివారు సుమారు రెండు వేల ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే గుట్టపై వెలిసిన స్వామి వారిని దర్శించుకోలేని భక్తుల కోసం కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్తులు గుట్టకింది ఆవరణలో గర్భగుడి నిర్మించారు. శ్రీ సీతారామ లక్ష్మీనృసింహస్వామివారి విగ్రహా న్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గుట్ట పైన, కింద రెండు చోట్లా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. కింద ఉన్న గర్భగుడి శిథిలావస్థకు చేరడంతో స్పందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గత జాతరకు ముందు రూ.50లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ నిధులతో గర్భగుడి నిర్మాణంలో ఉన్నది.
ఆహ్లాదకరమైన వాతావరణం..
పెద్ద గుట్ట.. చుట్టూ పచ్చని చెట్లతో జాతర ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతుంది. గతంలో స్వామివారి భక్తులు వివిధ గ్రామాల నుంచి ఎడ్లబండ్లపై వచ్చి గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కాలక్రమేణా ఎడ్లు, బండ్లు కట్టకపోవడంతో ప్రస్తుతం ట్రాక్టర్లు, యంత్రా లు, వాహనాలతో ప్రదక్షిణలు చేస్త్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇలా చేరుకోవాలి..
కరీంనగర్-హైదరాబాద్ రోడ్డులో నుస్తులాపూర్ స్టేజీ నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్తే స్వామివారి క్షేత్రం వస్తుంది. ఇక్కడికి వెళ్లేందుకు జాతర సమయంలో ప్రత్యేకంగా ఆటోలు నడిపిస్తారు.
ఏర్పాట్లు పూర్తి..
జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండలు ప్రారంభమైన దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేశారు. గుట్ట చుట్టూ రెండు కిలోమీటర్ల మేర బండ్లు తిరిగేందుకు దారిని బాగు చేశారు.
ప్రత్యేక పూజా కార్యక్రమాలు
ఈ నెల 9న ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21వరకు కొనసాగుతాయి. 14న పుణ్యహవాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, ధ్వజారోహణం ఋత్విక్ వరుణం, సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం, రాత్రి హోమం, బలిహరణం చేయనున్నారు. 15న నిత్యహోమం, బలిహరణం, తీర్థ హోమం, 16న హోమం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, 17న నిత్యహోమం, బలిహరణం, 18న సాయంత్రం బండ్లు తిరుగుట, 19న సాయంత్రం దోఫోత్సవం, 20న రాత్రి11 గంటలకు రథప్రతిష్ఠ, రథబలి, రథోత్సవం, 21న స్వామివారు రథం నుంచి ఆలయానికి చేరుకోనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
భక్తుల కొంగుబంగారమైన శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం, పంచాయతీ సహకారంతో వసతులు కల్పించాం. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది.
-దన్నమనేని శ్రీనివాస్‌రావు, ఆలయ చైర్మన్