నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 6: మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కష్టాలను బెదురులేకుండా ఎదుర్కొంటున్నారు. పిరికితనం వదిలేసి పిడికిలి బిగిస్తూ, పురుషులకు మించి తమ శక్తి, యుక్తులను చాటుకుంటున్నారు. ఇంటా బయటా అన్నింటా తమదైన ముద్రవేస్తున్నారు. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై, విజయపథాన నడుస్తున్నారు.
ఆత్మవిశ్వాసానికి ప్రతీక రాజేశ్వరి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరికి మాటలు సరిగా రాకపోయినా, చేతులు పనిచేయకపోయినా కాళ్లతోనే సాహిత్య సేద్యం చేస్తున్నది. నేత కార్మిక కుటుంబంలో బూర అనసూర్య-సాంబయ్య దంపతులకు 1980లో జన్మించింది. అంగవైకల్యంతో పుట్టడంతో రాజేశ్వరి ఆనందాలకు దూరమైంది. చేతులు కూడా సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకున్నది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి దాకా చదివింది. 1999 నుంచి వరుసగా కవిత్వం రాయడం ప్రారంభించింది. ఇప్పటివరకు 350కి పైగా కవితలు రాసింది. కంప్యూటర్ను సైతం కాలుతోనే ఆపరేట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నది. కాగా, ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి.. ఎందరికో స్ఫూర్తినిచ్చేలా రాజేశ్వరి జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. ఇంటర్ సెకండియర్ తెలుగు విభాగంలో ‘సిరిసిల్ల రాజేశ్వరి’ పేరుతో ప్రత్యేక పాఠాన్ని ముద్రించింది. ‘నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్యకళ ఆగదు. వెలుగుతున్న చంద్రునికి కండ్లు లేకున్నా వెలుతురును ఇస్తూనే ఉంటాడు. అలాగే జలపాతానికి కాళ్లు లేకపోయినా పారుతూనే ఉంటుంది. అలాగే నాకు రాసేందుకు చేతులులేకున్నా నా సాహితీ సేద్యం సాగుతూనే ఉంటుంది అని చెబుతున్నది’ రాజేశ్వరి. అన్నిరంగాల్లో సంపూర్ణంగా రాణించాలని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వివరిస్తున్నది.
ఎవుసంలో ఆమె
వ్యవసాయ రంగంలో అన్నీ తానై మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పనులు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నది ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వీర్ల రాజేశ్వరి. భర్త సదయ్యకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయనతో సమానంగా పనులు చేస్తున్నది. ఊరు చివరన దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని గుట్టల్లో వారికి ఆరెకరాల భూమి ఉంది. వరి, పత్తి, మక్క వేస్తుంటారు. అంతదూరంలో ఉన్న భూముల వద్దకు రోజూ ఎడ్లబండి కట్టుకుని వెళ్తుంటుంది. మధ్యాహ్నం వెళ్లి చీకటి పడే దాకా పనుల్నో నిమగ్నమవుతుంది. భర్త పనిపడి బయటికి వెళ్తే ఒక్కతే ఎడ్లబండిపై వెళ్లి పనులన్నీ చూసుకుంటుంది. పంటలో కలుపు తీయడం, తౌటం పెట్టడం, మోటర్ పెట్టి పంటలకు నీరందించడం వంటి పలు పనులు చేస్తుంది. ఆవులు, బర్రెలను పెంచుతూ పాలు విక్రయిస్తుంది. పండించిన కూరగాయలను ఉదయం, సాయంత్రం గ్రామంలో తిరుగుతూ అమ్ముతుంది. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా ఖాళీగా ఉండకుండా ఇంట్లో పని, వ్యవసాయ పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఇష్టంతోనే ఉద్యోగాన్ని సాధించిన..
నాకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. అన్నదాతలకు సేవలందించాలనే ఉద్దేశంతోనే అగ్రికల్చర్ బీఎస్పీ పూర్తిచేసిన. పట్టుదలతో చదివి ఏవోగా ఉద్యోగాన్ని సాధించిన. ప్రతిరోజూ మండలంలోని ఒకటి రెండు ఊర్లకు స్కూటీపై వెళ్తా. రైతులకు సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తా. పంటల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తా. పంటల దిగుబడి పెంచడంలో కీలకభూమిక పోషించడం ఆనందంగా ఉన్నది.
– కన్నం యోగితా, వ్యవసాయ అధికారి (కథలాపూర్)
సేవలందించాలనే పోలీస్‌శాఖలోకి..
ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించాలనే ఉద్దేశంతోనే పోలీసుశాఖలో చేరిన. ఇక్కడ పనిచేయడం కొంత కష్టమైనప్పటికీ ఇష్టంతోనే విధులు నిర్వర్తిస్తున్న. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిపెడుతున్న. ఒక మహిళా అధికారిగా మహిళల సమస్యలను పరిష్కరించడం సంతోషంగా ఉన్నది. సమస్య పరిష్కరించినప్పుడు బాధితుల కండ్లల్లో ఆనందాన్ని చూస్తే ఎంతో సంతృప్తి అనిపిస్తుంది.
– అరిపెల్లి రజిత, ఎస్ఐ (కథలాపూర్)