కరీంనగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అమాత్యుడు రామన్న పిలుపుమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలను జోరుగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలతో పాటు పల్లెపల్లెనా అట్టహాసంగా వేడుకలను జరుపుకొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కూడళ్లలో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. పలుచోట్ల ‘కేసీఆర్ మహిళాబంధు’ ఆకృతిలో మానవహారాలను ఏర్పాటు చేశారు. నిరంతరం ప్రజల సేవలో తరిస్తున్న అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలో ఆదివారం కేసీఆర్ మహిళాబంధు సంబురాలు ఊరూరా అట్టహాసంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీలతో హోరెత్తించారు. కేసీఆర్ చిత్రపటాలు, కటౌట్లకు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్‌కు థాంక్యూ ఆకృతిలో మానవహారంగా ఏర్పడ్డారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టి అభిమానాన్ని ప్రదర్శించారు. మహిళలను సునీల్‌రావు సత్కరించి మొక్కలను బహూకరించారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మహిళా పారిశుధ్య కార్మికులను జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు సన్మానించి చీరెలు పంపిణీ చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు. అన్ని డివిజన్లలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. మహిళా ప్రజాప్రతినిధులు మహిళలతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్, గన్నేరువరం మండలకేంద్రాలు, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో కేసీఆర్ కటౌట్లకు, కొండాపూర్‌లో కేసీఆర్ విగ్రహానికి మహిళలు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటారు. మానకొండూర్‌లో మహిళా ప్రజాప్రతినిధులు, పంచాయతీ, ఆశ కార్యకర్తలు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సన్మానించారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో మహిళలు భారీ ర్యాలీ తీశారు. అనంతరం థాంక్యూ కేసీఆర్ ఆకృతిలో మానవహారంగా ఏర్పడ్డారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణచౌరస్తాలో మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు.