హుజూరాబాద్ టౌన్/ సైదాపూర్, మార్చి 6: వైద్య విద్య కోసం సుదూర దేశం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన విద్యార్థులు ఒక్కొక్కరుగా సురక్షితంగా స్వదేశానికి తిరిగివస్తున్నారు. తాజాగా సైదాపూర్ మండలం గుండ్లపల్లి సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు వీరమల్ల రవీందర్‌రెడ్డి-సరోజన దంపతుల కుమారుడు సాయినాథ్‌రెడ్డి, ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఆవుల రజితా-కుమారస్వామి దంపతుల కుమార్తె మానస, హుజూరాబాద్ పట్టణానికి చెందిన కర్ర పాపిరెడ్డి-సరళ దంపతుల కుమారుడు కర్ర నిఖిల్‌రెడ్డి ఇంటికి తిరిగి వచ్చారు. భయానక వాతావరణం నుంచి క్షేమంగా వచ్చిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేశారు. కాగా, ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులను కళ్లారా చూసిన వైద్య విద్యార్థులు తమ అనుభవాలను పంచుకొన్నారు.
ఐదు రోజులు బంకర్లలోనే ఉన్నం
వైద్య విద్యకోసం ఆరు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లా. ఆ దేశ రాజధాని కీవ్‌లోని బోగోమెలేట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య ఫైనలియర్ చదువుతున్న. మరో రెండు నెలల్లో వైద్యవిద్య పూర్తికానుండగా, ఈ క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐదు రోజుల పాటు బంకర్లలోనే తలదాచుకున్నం. అక్కడ నుంచి రైల్ ద్వారా సరిహద్దుకు చేరుకున్నం. కాలినడకనే సరిహద్దు దాటాం. హంగేరి నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం గుండ్లపల్లికి చేరుకున్న. సురక్షితంగా ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉన్నది.
ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
నేను ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్, జాఫ్రొజియా నగరాల్లో వైద్య విద్యను అభ్య సించడానికి వెళ్లా. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో నాతో పాటు అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులు ఎంతో ఆందో ళనకు గురయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడి ఈ నెల 2న ఆ దేశం సరిహద్దుకు చేరాం. ఈ నెల 5న ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చిన. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.
ఆందోళనకు గురయ్యాం
వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ దేశానికి 6 సంవత్సరాల క్రితం వెళ్లిన. జాఫ్రొజియాలో వైద్య విద్యనభ్యసిస్తున్న. యుద్ధం ప్రారంభంకాగానే తీవ్ర భయాందోళనకు గురయ్యా. రెండు రోజులపాటు బంకర్లలోనే తలదాచుకున్న. రైల్ ద్వారా హంగేరి బార్డర్‌కు చేరుకున్నం. అక్కడ నుంచి ఢిల్లీ చేరుకొని మా ఊరికి వచ్చిన. ఇక్కడి విద్యార్థులు క్షేమంగా తిరిగి రావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంతో ఉంది.