గంగాధర, మార్చి 6: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటి విడుదలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపట్టి వద్ద ఎల్లంపల్లిపల్లి పైపులైన్ మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి వద్ద పైపులైన్‌పై రెండు మీటర్ల ఎత్తుమట్టిని పోశారని గుర్తు చేశారు. విషయం తెలియని స్థానిక రైతులు వ్యవసాయ పనుల కోసం పైపులైన్‌పై ఉన్న మట్టిని తొలగించారన్నారు. నీటి ఒత్తిడిని తట్టుకోలేక పైపులు పైకి లేవడంతో నీటి విడుదలకు అంతరాయం ఏర్పడిందన్నారు. రైతులు పైపులైన్‌పై పంటలు సాగు చేయవద్దని సూచించారు. పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి నీటిని విడుదల చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పుల్కం గంగన్న, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, నాయకులు సముద్రాల అజయ్, బెజ్జెంకి కళ్యాణ్ తదితరులున్నారు.