-కరీంనగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) /మెట్పల్లి: ఉక్రెయిన్‌లో చిక్కుకుని అష్ట కష్టాలు పడ్డ ఐదుగురు మెడికోలు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. పది రోజుల ఉత్కంఠకు తెరపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 24న రష్యా దళాలు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించగా, అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఎంతో మంది వైద్య విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. కరీంనగర్‌లోని కట్ట రాంపూర్‌కు చెందిన జీ శిరీష, ఏ రవిచంద్రిక, ఆశ్రిత, శ్రీశాంత్, మెట్‌పల్లికి చెందిన తూముల భవాని కూడా అలాగే చిక్కుకొని కష్టాలు పడ్డారు. శుక్రవారం వీరు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. అక్కడి యుద్ధ పరిస్థితులను కళ్లారా చూసిన తాము తిరిగి మాతృభూమిలో అడుగు పెడుతామని అనుకోలేదని, ఎన్నో కష్టాలు పడి ఇంటికి చేరుకున్న తర్వాత కష్టాలన్నీ మరిచిపోయామని మెడికోలు చెబుతున్నారు.
ఇంటికి వస్తామని అనుకోలేదు..
ఉక్రెయిన్‌లోని వినిస్తీయాలో మెడిసిన్ చదువుతున్న కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన గొట్ట శిరీష మాట్లాడుతూ ఎన్నో కష్టాలు అనుభవించి ఇంటికి చేరుకున్నామని భావోద్వేగానికి గురైంది. ‘గత నెల 24న రష్యా దళాలు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచీ మాలో భయం మొదలైంది. ఇక్కడికి వచ్చేందుకు ఆ రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాం. కానీ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. యుద్ధం మొదలైన తర్వాత రెండు రోజులు మేం వినిస్తీయాలోనే ఉన్నాం. మా హాస్టల్ గది ఏడు అంతస్తులపై ఉంటుంది. సైరన్ వచ్చినపుడల్లా లగేజీ సర్దుకుని గ్రౌండ్ ఫ్లోర్‌కు పరుగెత్తేవాళ్లం. మళ్లీ కొద్దిసేపటి తర్వాత పైకి వెళ్లేవాళ్లం. ఇలా రోజులో అనేక సార్లు కిందికి, పైకి వెళ్లేవాళ్లం. రాత్రంతా బంకర్లలో గడిపేవాళ్లం. ఉక్రెయిన్ బార్డర్ దాటేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. 25న రైలులో హంగేరీకి వెళ్లే ప్రయత్నం చేశాం. కానీ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి హాస్టల్‌కు వచ్చాం.
26న కన్సల్టెన్సీ వాళ్లు రొమేనియా బార్డర్ వెళ్లేందుకు బస్సులు అరేంజ్ చేశారు. బస్సుల్లో కిక్కిరిసి ఎక్కాం. అక్కడి డబ్బులు తీసుకుని చెర్నీవెస్టీకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ రెండు, మూడు వేల మంది వేచి ఉన్నారు. దాదాపు అన్ని దేశాలకు చెందిన వాళ్లు అక్కడ ఉన్నారు. యూరోపియన్స్, ఉక్రెయిన్ వాళ్లకు ప్రియార్టీ ఇచ్చి బార్డర్ దాటించారు. మేము కూడా వెళ్తాం అంటే తోసేసేవాళ్లు. కొట్టే వాళ్లు. కొందరు బాయ్స్ గేట్లు దుంకే ప్రయత్నం చేస్తే గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. రెండు మూడు గంటలకు పది మందిని బార్డర్ దాటించారు. అక్కడ బార్డర్ దాటాలంటే రెండు రోజులు పట్టింది. కనీసం షెల్టర్ సదుపాయం కూడా లేకపోవడంతో రెండు రాత్రులు చలిలోనే గడిపాం. తిండి లేక, నిద్ర లేక మాలో చాలా మంది నీరసించి పోయారు. అలా అనేక కష్టాలు పడి ఉక్రెయిన్ బార్డర్ దాటి రొమేనియాలో అడుగు పెట్టిన తర్వాత కూడా కష్టాలు తప్ప లేదు. ఈ రెండు దేశాల బార్డర్ దాటాలంటే రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లాం. ఆ రోజు రాత్రంతా రొమేనియా బార్డర్లో కూడా చలిలోనే ఉన్నాం.
రాత్రి 7 గంటలకు అక్కడికి చేరుకుంటే ఉదయం వచ్చి కొందరు పికప్ చేసుకున్నారు. అక్కడ సిరెట్ అనే విలేజ్‌లో షెల్టర్ ఇచ్చారు. అక్కడ తిండి లేక, కనీసం మంచి నీళ్లు లేక రెండు రోజులు గడిపాం. రెండు రోజుల తర్వాత సిరెట్ విలేజ్ నుంచి ఎయిర్ పోర్టు ఉన్న బుకారస్ట్కు బస్సులో బయలుదేరాం. 8 గంటల ప్రయాణం తర్వాత బుకారస్ట్కు చేరుకున్నాం. అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్లు పికప్ చేసుకున్నారు. ఒక రోజంతా షెల్టర్‌లోనే ఉంచారు. అక్కడ కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఎయిర్ పోర్టులో ప్రవేశించడానికి బోర్డింగ్ పాస్ కోసం పెద్ద క్యూ ఉండింది. నాలుగైదు గంటలు నిలబడితేగాని ఎయిర్ పోర్టులోకి ప్రవేశించలేదు. ఎట్టకేలకు నిన్న ఉదయం 6 గంటలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కి రాత్రి 11 గంటలకు ఢిల్లీలో దిగాం. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌కు వచ్చాం.
మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరా. నాతోపాటు 30 మంది వరకు మన తెలుగు వాళ్లు వచ్చారు. కరీంనగర్ వాళ్లమైతే నేను రవి చంద్రిక, ఆశ్రిత, శ్రీశాంత్ ఉన్నాం. ఎయిర్ పోర్టులో మా అమ్మానాన్నలను చూసిన తర్వాత ఉక్రెయిన్, రొమేనియాలో నేను పడిన కష్టాలన్నీ మర్చిపోయా. అక్కడి పరిస్థితులు చూస్తే ఇండియాకు వస్తామో లేదో అని భయపడ్డాం. కానీ మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా ఈ రోజు మా అమ్మానాన్నలను చూడగలిగా. ఇంకా చాలా మంది అక్కడే ఉండి అష్ట కష్టాలు పడుతున్నారు. యుద్ధం కూడా తీవ్రతరం అవుతోంది. సాధ్యమైంత త్వరగా వాళ్లందరిని భారత్‌కు తీసుకురావాలని కోరుకుంటున్నాను..’ అని శిరీష భావోద్వేగానికి గురైంది.