చొప్పదండి, మార్చి 4: దళితులు ఆర్థిక ప్రగతి సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ చిలుకరవీందర్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం ద్వారా నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని అన్నారు. దళితబంధును పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని నియోజకవర్గంలో 12 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు. గుమ్లాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి రామడుగు వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను మూడు నెలల్లో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా 13 పాఠశాలలను ఎంపిక చేసి, అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చొప్పదండి పీహెచ్‌సీని అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, చొప్పదండి పట్టణంలో నిర్మించిన మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గదులను కొత్త టెండర్ల ప్రకారమే అద్దెకు ఇవ్వాలని మండల పరిషత్ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.