ధర్మారం, మార్చి 4: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, రాష్ట్ర అభివృద్ధి దేశానికే స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. మొదట మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, డైనింగ్ హాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, నిర్వహణ తీరు బాగుండాలని ప్రిన్సిపల్ గిరిజకు సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనం అందించాలని ఆయన పేర్కొన్నా రు. అనంతరం ధర్మారంలో పర్యటించి కోరుట్లకు చెందిన మైనార్టీ అనుబంధ స్టార్ మహిళా స్వచ్ఛంద సంస్థ వారు ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్లింలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని, కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.
అనంతరం ఆయన నంది మేడారంలో పర్యటించి రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని రైతు వేదిక వద్ద మండలంలోని ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు, పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దొంగతుర్తిలో వైకుంఠధామాన్ని, మల్లన్న గుడి వద్ద బోర్వెల్ను ప్రారంభించి, రూ.25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఆయన భూమి పూజ చేశారు. కాగా నంది మేడారంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. మన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు చూసిన సరిహద్దు రాష్ర్టాల ప్రజలు మన రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
నంది మేడారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ కింద ఉన్న పాతచెరువు శిఖం భూమిని చదువును చేసి ఎంతో అహ్లాదకరంగా మార్చామని ఇంకా కట్ట మొదటి భాగంలో చదును చేయిస్తామని ఆయన వివరించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ.3కోట్ల వ్యయంతో బైపాస్ రోడ్డు నుంచి జీపీ కార్యాలయం దాకా బీటీ రోడ్డును విస్తరించే పనులు మొదలయ్యాయని, గ్రామంలోని పీహెచ్సీలో 30 పడకల నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈసందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులరైజ్ చేయాలని మంత్రి ఈశ్వర్‌కు వినతి పత్రం సమర్పించారు. మోడల్ పాఠశాలలో పది చదువుతున్న ఆవుల ప్రణీత సాఫ్ట్ బాల్లో జాతీయస్థాయికి ఎంపిక కావడంతో ఆమెన మంత్రి అభినందిచారు. ఈసందర్భంగా ఆశ కార్యకర్తలను మంత్రిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, తహసీల్దార్ వెంకట లక్ష్మి, ఎంపీడీవో జయశీల, పీహెచ్సీ వైద్యుడు సంపత్ రెడ్డి, పీఆర్ ఏఈ రాజశేఖర్, సర్పంచులు పూస్కూరు జితేందర్‌రావు, సామంతుల జానకి, పాలకుర్తి సత్తయ్య, తుమ్మల రాంబా బు, కట్ట సరోజ, మిట్ట తిరుపతి, దాడి సదయ్య, ఉప సర్పంచులు ఆవుల లత, కట్ట రమేశ్, ముత్యా ల చంద్ర శేఖర్, ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి సలామొద్దిన్, ఎండి రఫి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య,ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.