కరీంనగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దశల వారీగా మూడేళ్లలో దీనిని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించడంతోపాటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7,289 కోట్లు కేటాయించిన విషయం విదితమే. అందులో భాగంగా ఏటా 33 శాతం చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి.. మౌలిక సదుపాయాలతోపాటు ఆధునిక హంగులు కల్పించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే సమయంలో ఇంగ్లిష్ మీడియాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అమలు చేయాలని ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా జిల్లా అధికారులను ఉపసంఘం ఆదేశించింది.
ఇంగ్లిష్‌లో బోధించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలను నేర్పేందుకు అవసరమైతే టీ-శాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ‘మన ఊరు-మన బడి’లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి వస్తే.. విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహించి, అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక పథకానికి ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వనపర్తిలో అంకురార్పణ జరుగనున్నది.
లక్షా 70 వేల మందికి ప్రయోజనం
ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 2,514 నడుస్తున్నాయి. గతేడాది గణాంకాల ప్రకారం చూస్తే.. 1,90,198 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, అందులో 9వ, 10వ తరగతులను ప్రస్తుతం మినహాయిస్తే.. 1,971 పాఠశాలల్లో అధికారికంగా ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రానుంది. తద్వారా లక్షా 70 వేల మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక వైపు మౌలిక సదుపాయాలు సమకూరడంతోపాటు మరోవైపు ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. ఇదే సమయంలో డిజిటల్ క్లాస్రూంలు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అన్ని రకాలుగా రాణించేందుకు ఈ కొత్త సాంకేతిక మార్పులు, ఏర్పాట్లు ఉపయోగపడుతాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
అయితే, ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధించగలరా? అన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత టీచర్లకు తర్ఫీదునివ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో మంచి పట్టున్న నిష్ణాతులను గుర్తించిన విద్యాశాఖ, సదరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే ‘మన ఊరు.. మన బడి’లో భాగంగా రాబోయే మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలోని 829 పాఠశాలలు పూర్తిస్థాయిలో ఆధునీకరణ కావడంతోపాటు కార్పొరేట్ లుక్ రానుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సౌకర్యాలు మెరుగుపడ్తయ్
‘మన ఊరు-మన బడి’ తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు కచ్చితంగా మారిపోతాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నారు. కొత్త తరగతి గదులు నిర్మించే అవకాశం ఉంది. కాంపౌండ్ లేని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించడం, అసంపూర్తిగా ఉన్న ప్రహరీలు పూర్తి చేయడం, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండడానికి వంటగది ఏర్పాటవుతుందని భావిస్తున్నాం. లైబ్రరీ రూం, లాబొరేటరీ, డిజిటల్ తరగతి గదులతో పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని విశ్వసిస్తున్నాం. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ అందుబాటులో ఉన్నా రన్నింగ్ వాటర్ సౌకర్యం దాదాపు తకువే. టాయిలెట్స్ అన్నీ బయో టాయ్‌లెట్స్‌గా ఆధునీకరిస్తారని భావిస్తున్నాం.
ఈ పథకం కింద అన్ని పాఠశాలలకు నిర్ణీత కాల వ్యవధిలో సున్నం, పెయింటింగ్స్ వేయడం, అవసరమైన కంప్యూటర్లు, సైన్స్, లైబ్రరీ మెటీరియల్ సమకూరుతుందని అనుకుంటున్నాం. ప్రతి మండలం నుంచి కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో దాన్ని ఒకో ప్రత్యేక క్రీడాంశంలో అభివృద్ధి చేసుకోవాలి. ‘ఇంటి ముందున్న వాకిలి చకదనం చూసి ఆ ఇంటి గురించి మనం చెప్పచ్చు’ అన్న పాత నానుడి మాదిరిగా భవిష్యత్తులో ఆ ఊరిలో ఉన్న బడిని చూసి ఆ ఊరి గొప్పతనాన్ని అంచనా వేయొచ్చు అని చెబుతారేమో.. ఈ పథకంలో భాగంగానే అవసరమైన సహాయ సిబ్బందిని సమకూర్చితే బాగుంటుంది. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయం. ఆయన దృష్టి సారించారంటే విద్యాశాఖ రాష్ట్రంలో ఎంతో బలోపేతమవుతుంది.
– పరాంకుశం రాజభాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (తిమ్మాపూర్‌రూరల్)
ఆంగ్లవిద్యతో భవిష్యత్తుకు భరోసా
ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని, అందులో భాగంగానే సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారని మంథనికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు పవిత్రం భూమయ్య అభినందించారు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేందుకు తెచ్చిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని సూచించారు. పోటీ ప్రపంచంలో సర్కారీ పాఠశాల విద్యార్థులను దీటుగా నిలబెట్టేందుకు ఆంగ్ల విద్యను ప్రవేశ పెడుతున్నారని, ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంపై గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో అనేక సంస్కరణలను తీసుకువస్తున్నది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేందుకు గురుకులాలను ఏర్పాటు చేసింది.
ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకుండా తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను బలోపేతం చేసింది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేట్‌కు దీటుగా మార్చబోతున్నది. పోటీ ప్రపంచంలో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వ విద్యార్థికి తర్ఫీదును ఇవ్వనున్నది. ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిగా ప్రవేశ పెట్టి తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన సత్తా చాటుకునే తీరుగా నిర్ణయాన్ని ప్రకటించింది. సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన లేక పేదలు పడుతున్న అవస్థలను దూరం చేసేందుకు ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివి ఖర్చుతో కుదేలవుతున్న కుటుంబాలకు భరోసానిచ్చినైట్లెంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం స్వాగతించదగ్గది. దీనిని అందరూ ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక దృష్టితో ఆలోచించాలి. ప్రపంచమే వసుదైక కుటుంబం అనే భావన వచ్చింది. అన్ని రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. ఆంగ్ల మాధ్యమ ప్రవేశం ద్వారా మరింత ముందుకు వెళ్తుంది. ఇది పేద, మధ్య తరగతి పిల్లలకు ఉపకరించే, సామాజిక సమానత్వాన్ని సాధించే నిర్ణయం. ఇలాంటి విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు, విజ్ఞానవంతులు, మేధావులు, రాజకీయ నాయకులు, సబ్బండ వర్గాలు సహకరించి చిన్నారుల ఎదుగుదలలో భాగస్వాములు కావాలి.
అనుమతుల అవస్థలు దూరం
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారికంగా ఉండగా.. మరికొన్ని చోట్ల అనధికారికంగా చెబుతున్నారు. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడి మేరకు.. ఆంగ్ల మీడియం కొనసాగించాలంటే అందుకు పర్మిషన్లు పొందడం సదరు పాఠశాలలకు కష్టంగా మారింది. అనుమతుల కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తున్నది. ఏ పాఠశాలలోనైనా సరే ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలంటే ముందుగా గ్రామ సభ తీర్మానం చేయాలి. ప్రాథమిక పాఠశాల వరకైతే జిల్లా విద్యాధికారి అనుమతి తీసుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలైతే ఆర్జేడీకి దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలి. ఉన్నత పాఠశాలలైతే విద్యాశాఖ కమిషనర్ నుంచి అనుమతి ఉత్తర్వులు పొందాలి. ఒక్కోసారి పర్మిషన్ పొందడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అంతేకాదు, కొంత మంది వ్యతిరేకించడం.. మరికొంత మంది ఉండాలని కోరడం వల్ల ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు సైతం అయోమయంలో పడేవారు. ఇక నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రభుత్వమే నేరుగా అమలు చేస్తుండడంతో అనుమతుల కోసం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు.
ఇది గొప్ప నిర్ణయం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం హర్షదాయకం. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఆంగ్ల మాధ్యమం ప్రారంభం ఎంత ముఖ్యమో.. అది విజయవంతమయ్యేందుకు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడులు బలోపేతమవుతాయి. అన్నిచోట్ల మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. దాంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించవచ్చు.
– బీ రఘునందన్‌రావు,
జిల్లా సైన్స్ అధికారి (పెద్దపల్లి)