– రెబ్బెన, మార్చి 3: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ.. వచ్చే ఏడాది ప్రారంభానికి సిద్ధమవుతున్నది!. 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించిన సింగరేణి.., అవసరమైన 1,350 హెక్టార్ల భూమిలో కొంతమేర అటవీశాఖ పరిధిలో ఉండడంతో అనుమతి కోసం కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో పనులు పూర్తిచేసి మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీని జీవితకాలం సుమారు 15 ఏండ్లు ఉండగా, యేటా 2 మిలియన్ టన్నులు వెలికితీసేలా ప్రణాళిక రచించింది. దీంతో కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు నిరుద్యోగ యువతకు లబ్ధిచేకూరనుండగా, ఏరియాకు పూర్వవైభవం రానున్నది.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, అన్నింటా బెల్లంపల్లి.. భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. వీటిలో బెల్లంపల్లి అడవుల మధ్యలో ఉంది. అలాంటి ఏరియాలో గోలేటి-1 ఇైంక్లెన్, గోలేటి-1ఏ ఇైంక్లెన్ భూగర్భ గనులు చాలా ఏండ్లు నిర్విరామంగా బొగ్గు ఉత్పత్తి చేశాయి. భూగర్భ గనులతో పాటు అబ్బాపూర్ ఓసీపీ, కైర్‌గూడ ఓసీపీ, డోర్లి-1,2 ఓసీపీలు సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసి, సింగరేణికే తలమానికంగా నిలిచాయి. అలాంటి గనులు ఒక్కొక్కటీ మూతపడుతూ రావడంతో ఈ ఏరియా వైభవం తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం కైర్‌గూడ ఓసీపీ మీదనే ఏరియా ఆధారపడి ఉన్నది. బీపీఏ ఓసీపీ నుంచి అంతంత మాత్రంగానే ఉత్పత్తి అవుతుండడంతో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలు ఛేదించడంలో వెనుకబడిపోతున్నది. కొత్తగా ఓసీపీలు వస్తేనే ఏరియాకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు, కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
చిగురించిన ఆశలు..
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి, మాదారం ప్రాంతాల్లో కొత్తగా ఓసీపీలు ప్రారంభమవుతాయన్న ఊహాగానాలు వినిపించడంతో పాటు సర్వే పనులు చేపట్టడంతో ఏరియాలోని ప్రజల్లో ఆశలు చిగురించాయి. మూతపడిన గోలేటి-1, గోలేటి-1ఏ భూగర్భ గనులను ఓసీపీలుగా చేసేందుకు సింగరేణి యాజమాన్యం సర్వే నిర్వహిస్తున్నది. ఇప్పటికే అవసరమైన భూమి కోసం యాజమాన్యం అధ్యయనం చేసింది. ఇందుకు 1,350 హెక్టార్లు అవసరం ఉండగా, ఇందులో 615 హెక్టార్లు అటవీ శాఖ ఆధీనంలో ఉంది. వీటి అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత, రాష్ట్రస్థాయి అనుమతులు పూర్తిచేసి, కొత్త ఓసీపీ ప్రారంభానికి సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. 2023-2024లో బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అపారమైన బొగ్గు నిల్వలు..
ఈ ఏరియాలో మూతపడిన అన్ని భూగర్భ గనుల్లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గోలేటి భూగర్భ గనుల్లో 40 మిలియన్ టన్నుల సంపద ఉం డగా, ఎంవీకే-1, ఎంవీకే-2, ఎంవీకే-3 భూగర్భ గనుల్లో 30 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. రెండు ఓసీపీల కోసం సింగరేణి కసరత్తు చేస్తున్నప్పటికీ గోలేటి ఓసీపీ ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 15 ఏండ్లపాటు నిర్విరామంగా నడుస్తుందని, యేటా 2 మిలియన్ ట న్నుల బొగ్గు వెలికితీయవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అనుమతులు రాగానే ప్రారంభం..
అటవీ శాఖ అనుమతులు రాగానే వచ్చే ఏడాది గోలేటి ఓసీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు పంపించాం. పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు ఎంవీకే ఓసీపీ ప్రారంభమైతే ఏరియాకు పూర్వవైభవం వచ్చి, కార్మికులతో ఏరియా కళకళలాడుతుంది. గోలేటి-1 ఇైంక్లెన్, గోలేటి-1ఏ ఇైంక్లెన్ భూగర్భ గనులు, అబ్బాపూర్ ఓసీపీ మొత్తం కలిసి గోలేటి ఓసీపీగా ప్రారంభమవుతుంది. ఇక్కడి ఓసీపీలో జీ-10, జీ-11, జీ-13 గ్రేడ్ రకం బొగ్గు లభిస్తుంది.
– బీ సంజీవరెడ్డి, జీఎం, బెల్లంపల్లి ఏరియా
పూర్వ వైభవం వస్తుంది..
గోలేటి-1, గోలేటి-1ఏ భూగర్భ గనులు నడుస్తున్న సమయంలో కార్మికులతో ఏరియా కళకళలాడింది. గోలేటి-1లో 1600, గోలేటి-1ఏలో 1200 మందితో ఎంతో సందడిగా ఉండేది. భూగర్భ, ఓసీపీలు మూతబడడంతో సంఖ్య గణనీయంగా తగ్గింది. మళ్లీ గోలేటి ఓసీపీ, ఎంవీకే ఓసీపీలు ప్రారంభమైతే పూర్వవైభవం వస్తుంది. నేను 1984లో గోలేటి-1 గనిలో ట్రైనీ ఫిట్టర్‌గా విధుల్లో చేరి, 2018 వరకు ఉద్యోగం చేసిన. అప్పటి నుంచి బీపీఏ ఓసీపీటూలో మెకానికల్ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నా.
– సంగెం ప్రకాశ్‌రావు, మెకానికల్ ఫోర్మన్, బీపీఏ ఓసీపీ టూ, బెల్లంపల్లి ఏరియా