కరువు నేల పులకిస్తున్నది. బీళ్లువారిన భూమి సస్యశ్యామలమవుతున్నది. కడలివైపు పరుగెత్తే గోదారిని ఊర్థముఖంగా ఎదురెక్కించి తెలంగాణను సిరుల మాగాణిగా మార్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ కృషితో ముస్తాబాద్ సైతం మురుస్తున్నది. రైతన్న బతుకు మార్చి, సరికొత్త చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు మల్లన్న సాగర్ నుంచి మండలానికి తరలివచ్చి నేటితో ఏడాది పూర్తి చేసుకోగా, రైతన్న జీవనస్థితే మారిపోయింది. ఈ వసంత కాలంలోనే ఆయకట్టు ఆమాంతం పెరిగిపోగా, భూముల్లో సిరుల పంట పండుతుండడంతో కర్షకుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. తమ బతుకులు మార్చిన కేసీఆర్ దేవుడని కీర్తిస్తూనే, జేజేలు పలుకుతున్నది.
సిరిసిల్ల, మార్చి 3: కాళేశ్వరం జైత్రయాత్ర కొనసాగుతున్నది. దిగువ నుంచి ఎగువకు దిగ్విజయంగా పరవళ్లు తొక్కుతున్నది. ఒక్కో జిల్లాను ముద్దాడుతూ.. భూములను సస్యశ్యామలం చేస్తూ రైతన్న బతుకుచిత్రాన్నే మార్చివేస్తున్నది. మల్లన్నసాగర్ నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలాన్ని జలాలు ముద్దాడి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా నమస్తే ప్రత్యేక కథనం..
నాటి సంకల్పం.. నేడు సాకారం
ముస్తాబాద్ మండలం మెట్టప్రాంతం. కరువు నేల. నీటి వసతి అంతంతే. రైతులు పంటలు వేసినా అది వరుణుడి దయమీదే ఆధారపడి ఉండేది. ఇలా మండల రైతులు ఏం డ్లపాటు నరకం చూశారు. ఈ క్రమంలోనే నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నిరంతర కృషి చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అందులో మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల జి ల్లాలోని భూములను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేశారు. దీనికి సంబంధించి 2015లోనే అప్పటి పంచాయ తీ రాజ్ శాఖ మంత్రి, ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్, అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేర్ అతిథిగృహంలో నీటి పారుదల శాఖ, అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు.
ప్రాణహిత -చేవేళ్ల తొమ్మిదో ప్యాకేజీలో ముస్తాబాద్ మండలంలోని చీకోడు, చిప్పలపల్లి, బందనకల్, గూడెం, మోహినికుంట, మద్దికుంటలోని 16వేల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. మద్దికుంట వద్ద హైలెవల్ కెనాల్ ఏర్పాటు చేసి రూ.1500 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మూడేళ్ల కాలంలోనే ప్రాజెక్టును నిర్మించి ఒక్కో జిల్లాకు జలాలను తరలించడం మొదలు పెట్టారు. గతేడాది మార్చి 3న సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి, అలాగే మరో మార్గంలో తుక్కాపూర్ పం ప్‌హౌస్ నుంచి గోదారి జలాలు ముస్తాబాద్ మండలానికి పంపించగా, మార్చి 4న ఇక్కడి చెరువుల్లోకి చేరాయి. మద్దికుంట, చీకోడు, గూడెం, ఆవునూర్ చెరువులు, ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దచెరువు, మోహనికుంటలోని చెక్‌డ్యాంలు నిండగా, పంటలకు జలాలు అందాయి.
పంటలకు ప్రాణం పోసిన గోదావరి
గోదారి జలాల రాకతో మండలంలో ప్రతక్ష్యంగా, పరోక్షంగా దాదాపు 10 వేల ఎకరాలకు నీరందింది. ఆయకట్టు కూడా పెరిగింది. ఒకప్పుడు చివరికి నీరందక ఎండిన పొలాలు సైతం సస్యశ్యామలమై, సిరుల పంట పడింది. మొత్తంగా ముస్తాబాద్ మండలంలో 23,610 ఎకరాలను ముద్దాడి రైతన్న ముఖంలో ఆనందాన్ని నింపింది. తమ బతుకులు మార్చిన కేసీఆర్ దేవుడు అని, జీవితాంతం రుణపడి ఉంటామంటూనే, జేజేలు పలుకుతున్నది.
కేసీఆర్ దయవల్లే నీళ్లచ్చినయ్..
నేను పుట్టిన కాడి నుంచి ఎండకాలంల అలుగులు దుంకిన చెరువులను జూడలె.. ఎత్తున (మెట్ట) మీద మాకు నీళ్లు వస్తయని కలలో గూడ అనుకోలె.. కానీ సీఎం కేసీఆర్ దయవల్లే నిరుడు మా గడ్డకు గోదావరి నీళ్లచ్చినయ్.. బావుల్లో ఊటలు పడి నీళ్లతో నిండినయ్. చెరువులు కూడా పొంగిపొర్లినయ్..పంటలు గూడా బాగా పండినయ్..రైతులకు ఢోకా లేకుండా చేస్తున్న సీఎం సారును మరువం..
-కదిరే లక్ష్మి, మహిళా రైతు (మద్దికుంట)