కమాన్చౌరస్తా, మార్చి 3: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని నగరంలోని జ్యోతీరావు ఫూలే మైదానంలో హైదరాబాద్ బుక్ ఫేయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన గురువారం రెండో రోజూ కొనసాగింది. ఇందులో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్టాళ్లను సందర్శించి, పుస్తకాలను కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా గురువారం మహిళలు, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో మహిళలు, పిల్లల ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీబ్ల్యూవో పద్మావతి, డీఎంహెచ్వో జువేరియా, డాక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారులు, సీడీపీవోలు పోషణ అభియాన్ సిబ్బంది, ఎంఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సాయంత్రం సాధనాశూరుల ప్రదర్శన, బీసీ పాఠశాల విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హాజరై వీక్షించారు. అంతకు ముందు డా.మలయశ్రీ రచించిన తొలి తెలుగు చక్రవర్తులు-1, 2 నాటక సంపుటాలను, రాకుమార రచించిన తెలుగు వెలుగు ఖండకావ్యాన్ని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆవిష్కరించారు. అలాగే, దామరకుంట శంకరయ్య రచించిన ‘వయ్యి’ దీర్ఘ కవితను ప్రజా వాగ్గేయకారుడు, ప్రకృతి కవి జయరాజు ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పర్యావరణం ఆవశ్యకతను వివరించారు. అధికారులు, కవులు తదితరులు పాల్గొన్నారు.