కరీంనగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాంతర కాల్వ నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాంతర కాల్వ నిర్మాణంలో భాగంగా భూసేకరణ సర్వేపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గంగాధర, రామడుగు మండలాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి 90 శాతం భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణలో భూమి, బావులు నష్టపోయే రైతులకు తగిన పరిహారం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. భూసేకరణ సర్వే పూర్తయిన గ్రామాల్లో కాల్వ పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ సిటీ పనులు ప్రారంభించాలి
కరీంనగర్లో పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన స్మార్ట్ సిటీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కమాన్ నుంచి తీగల వంతెన వరకు అప్రోచ్ రోడ్డు పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు. కశ్మీర్‌గడ్డ రైతు బజార్, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట గల ఆర్అండ్బీ స్థలంలో సమీకృత మారెట్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి ప్రారంభించాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. నగరం పరిధిలోని 14 కిలో మీటర్ల పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం దుర్శేడ్ గ్రామ పరిధిలో స్థల సేకరణ పూర్తి చేసి కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి తీసుకొని పనులు ప్రారంభించాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధి సందీప్, మున్సిపల్, ల్యాండ్ సర్వే ఏడీ అశోక్, నీటిపారుదల, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.