ఎల్లారెడ్డిపేట, మార్చి 3: ఆపదలో ఉన్న పిల్లల కుటుంబాలకు ఆర్థిక చేయూత వెంకటాపూర్ స్కూల్‌తో ఇద్దరి టీచర్ల విడదీయలేని అనుబంధం ఒకరేమో స్కూల్లో రెండేండ్లపాటు పనిచేసి విరమణ పొందాడు. మరొకరేమో మూడేండ్లపాటు విధులు నిర్వర్తించి మరోచోటికి బదిలీపై వెళ్లాడు. ఇద్దరు టీచర్లు చదువుచెప్పిన బడిపై అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన పిల్లలపై మమకారాన్ని చాటుతున్నారు. స్కూల్లో వసతుల కల్పనకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు.
కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన వెన్నమనేని రాంచందర్‌రావు 2018 జూలైలో ఉద్యోగోన్నతిపై హెచ్ఎంగా వెంకటాపూర్ పాఠశాలకు వచ్చారు. సుమారు రెండేండ్లపాటు పనిచేసిన తర్వాత 2020 మేలో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన చిత్తశుద్ధితో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే సామాజిక సేవలో తరించేవారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ స్కూల్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అశ్విని తల్లిదండ్రులు మరణించారు. దీంతో అశ్విని, ఐదేండ్ల వయసున్న ఆమె తమ్ముడు దిక్కులేనివారయ్యారు. వీరి దయనీయస్థితిపై ‘అభాగ్యులకు దిక్కెవరూ’ శీర్షికతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని చదివి రాంచందర్‌రావు చలించిపోయారు. సదరు చిన్నారులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే పిల్లలందరికీ రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రూ.20వేలతో కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేయించాడు. అలాగే అదే పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా మూడున్నర సంవత్సరాలుగా పనిచేసిన గొల్లపల్లికి చెందిన కూర శ్రీనివాస్ సైతం రూ.20 వేల విలువైన టై బెల్టులు, బ్యాడ్జీలు, ఐడీ కార్డులను అందించారు.
సేవ చేయడంలోనే సంతృప్తి..
వెంకటాపూర్ స్కూల్ పిల్లలంటే ప్రత్యేక అభిమానం ఉన్నది. తక్కువ సమయంలోనే ఈ బడితో అనుబంధం పెనవేసుకున్నది. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం ఆనందంగా ఉన్నది. అంతేకాకుండా సామాజిక సేవ చేయడం ఎంతో సంతృప్తి ఉన్నది. మున్ముందు సైతం పిల్లలకు చేయడాన్ని కొనసాగిస్తా..
– వెన్నమనేని రాంచందర్‌రావు, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వెంకటాపూర్