కార్పొరేషన్, మార్చి 3: నగరంలోని ఫుట్‌పాత్ ఆక్రమణలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఆయన ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపుపై బల్దియా, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎవరైనా ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు అమ్మకాలు కొనసాగించకుండా చూడాలని, వారికి కేటాయించిన ప్రదేశాలకు పంపించాలన్నారు. పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు ఫ్రీగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రధాన రోడ్లపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు నిలుపకుండా చూడాలని, వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
చిరు వ్యాపారులకు కేటాయించిన స్థలంలోనే విక్రయాలు చేపట్టాలన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్లీ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమించే చిరు వ్యాపారులకు అండగా నిలిచే రాజకీయ ప్రతినిధులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 99 శాతం ఆక్రమణలు తొలగించడంలో సఫలీకృతమయ్యామని, మిగిలిన ఒక శాతం కూడా తొలగిస్తామన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మల్టీ లెవల్ టీమ్ లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. చిరు వ్యాపారులకు కేటాయించిన ప్రదేశంలోనే అమ్మకాలు కొనసాగించేలా చూస్తామని, అకడ వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.