కార్పొరేషన్, మార్చి 3: నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలోని 2, 22వ డివిజన్లలో రూ. 48 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శివారు డివిజన్లలో మంచినీటి సరఫరా ప్రెషర్‌తో అందించేందుకు రూ.5 కోట్లతో పైపులైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పైపులైన్ పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేసి, వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
శివారు డివిజన్లలో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సదుపాయాలు కల్పించడంతో పాటు లైటింగ్ సిస్టమ్, పారిశుధ్య పనులు సక్రమంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బుట్టిరాజారాంకాలనీలో మంచినీటి సరఫరాలో మంచి ప్రెషర్ పెంచే విధంగా రూ. 48 లక్షలతో పైపులైన్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనులు పది రోజుల్లో పూర్తి చేసి వేసవిలో మంచి ప్రెషర్‌తో వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పారును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లావణ్య, గంట కల్యాణి, నగరపాలక సంస్థ అధికారులు, ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కుట్లు మిషన్ అందజేత
అలయన్స్ క్లబ్ భగత్‌నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిసాన్‌నగర్‌కు చెందిన నిరుపేద రాజమణికి రూ.10వేల విలువైన కుట్టు మిషన్‌ను మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, అలయన్స్ క్లబ్ సభ్యులు నిరుపేదల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్, ప్రస్తుత తానా అధ్యక్షుడు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్-137 గవర్నర్ గాలిపెల్లి నాగేశ్వర్రావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ చీకోటి శ్రీనివాస్ గాంధీని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, బాలకృష్ణ, మొగులోజు సత్యాచారి, సత్తయ్య, నాగరాజు, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, కృష్ణ, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, నగేశ్, రాజిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.