ధర్మపురి, మార్చి 3: స్వరాష్ట్రంలోనే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతమయ్యాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో ధర్మపురి నియోజకవర్గస్థాయి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మానవ వనరులే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని భావించిన సీఎం కేసీఆర్ ఆ మేరకు కృషి చేస్త్తూ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు.
అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చారని, మెరుగైన విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అంగన్వాడీలకు వేతనాలు పెంచారన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు సమాజంలో గుర్తింపు, హోదా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి అంగన్వాడీ టీచర్లుగా మార్చామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వైద్య సేవలు అందించడంతో పాటు ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందుతున్నదన్నారు. టీచర్లు, ఆయాల పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచిందన్నారు. కరోనా సమయంలో వారి సేవలు అభినందనీయమన్నారు.
ధర్మపురిలో సీడీపీవో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్ల, ఆయాల సేవలు అభినందనీయమని, ఆయా కేంద్రాల్లో పిల్లలకు అమ్మ తర్వాత అమ్మలని కొనియాడారు. అనంతరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉండగా.. 1098 చైల్డ్ లైన్, 181 హెల్ప్‌లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు. కాగా, ఈ సందర్భంగా ధర్మపురికి చెందిన 12 మందికి ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున 100శాతం సబ్సిడీతో కూడిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులను మంత్రి ఈశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి డా.నరేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, ఆయా మండలాల ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.