డిపో-2 ఆవరణలో ఏపుగా పెరిగిన మొక్కలు
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న డీఎం, అధికారులు, సిబ్బంది
తెలంగాణచౌక్, మార్చి 1: హరితహారంలో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని డిపో-2లో సుమారు 20 ఎకరాల స్థలంలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. 2019 జూలైలో హరితహారంలో భాగంగా సుమారు 70 రకాల పండ్లు, పూల మొక్కలు నాటి, సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆర్టీసీ నిబంధనలు పాటిస్తూ, సంస్థకు లాభం తీసుకువచ్చేలా విధులు నిర్వహించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లతో మొక్కలు నాటించడంతో పాటు వాటికి వారి పేర్లు పెట్టారు.
మొక్కల సంరక్షణకు సిబ్బంది ఏర్పాటు
డిపో-2లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని కేటాయించారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొక్కలకు నీళ్లు పడుతున్నారు. మొక్కల చుట్టూ పాదుకలు తీస్తూ గడ్డి, పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నారు. డీఎంతో పాటు అధికారులు తరచూ పర్యవేక్షిస్తూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగడంతో డిపో ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసమే
డిపో ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినం. నిత్యం నీళ్లు పడుతుండడంతో ఏపుగా పెరిగినయి. భోజన సమయంలో సిబ్బంది వచ్చి విశాంత్రి తీసుకుంటున్నరు. –లక్కు మల్లేశం, మేనేజర్,డిపో-2
కంటికి రెప్పలా కాపాడుతున్నం
డిపో ఆవరణలో నాటిన మొక్కలను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నం. సుమారు 70 రకాల పండ్లు, పూల మొక్కలు నాటినం. ఉద్యోగులు, సిబ్బంది మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నరు. మొక్కలు ఏపుగా పెరుగడంతో డిపో ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. –జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్ డిపో-2