జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శివరాత్రి పర్వదినం
శివనామ స్మరణతో మార్మోగిన శైవాలయాలు
కమాన్‌చౌరస్తా, మార్చి 1: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పాత బజారులోని శ్రీ గౌరీశంకరాలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం వరకు శివలింగానికి క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, రజత కవచాలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు చేశారు. గౌరీ శంకరులకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. రాత్రి అభిషేకాల అనంతరం పల్లకీ సేవ, రథోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. పాతబజార్ శివాలయంలో మేయర్ వై సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు పూజలు చేశారు. అర్చకులు పురాణం చంద్రమౌళిశర్మ, పురాణం మహేశ్వర శర్మ, పురాణం శ్రీనివాస శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొద్దుటూరి శ్రీనివాస్, ఈవో ఉడతల వెంకన్న ఆధ్వర్యంలో అతిథులుకు హారతి ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు.
కమాన్ సమీపంలోని శ్రీరామేశ్వరాలయంలో స్వామి వారికి ప్రధానార్చకుడు శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజలు చేశారు. చల్మెడ వైద్య విద్యాసంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్ కొలిపాక అంజయ్య, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి పోకల లక్ష్మీనారాయణ, ఆర్థిక కార్యదర్శి భూపతి చిరంజీవి, అయిత రవీందర్, యెల్లంకి శంకర్, బండ వీరేశం, కొమురవెల్లి ప్రభాకర్, బీ మోహన్ రెడ్డి, రవీందర్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగత్‌నగర్‌లోని భవానీ శంకరాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేశారు. కార్పొరేటర్ తోట రాములు, కొర్ని సమ్మిరెడ్డి, జాతి శ్రీరాంరెడ్డి, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఆదర్శనగర్‌లోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, సాయంత్రం శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. రాత్రి పల్లకీ సేవ చేశారు. రేకుర్తిలోని అమృతేశ్వర మహాశివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. 8వ డివిజన్ (అల్గునూర్)లోని పురాతన శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ కల్యాణం జరిపించారు. గోదాంగడ్డలోని అయ్యప్ప ఆలయం, రేకుర్తి శివాలయం, విద్యానగర్ శ్రీ వేంకటేశ్వరాలయం, సప్తగిరికాలనీలోని శ్రీ కోదండరామాలయంలో భక్తులు పూజలు చేశారు. రామచంద్రాపూర్ కాలనీలోని దేవుళ్లపురి పంచముఖ హనుమదీశ్వరాలయం, కమాన్‌రోడ్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కార్పొరేషన్, మార్చి 1: భగత్‌నగర్‌లోని అయ్యప్ప ఆలయంలో గల శివాలయంలో మేయర్ వై సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురాతన శివాలయం, రేకుర్తిలోని అమృతేశ్వర శివాలయంలో పూజలు చేశారు. పూజల్లో కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు.