నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
విద్యానగర్, మార్చి 1: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, కార్మికులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని కోర్టుచౌరస్తా వద్ద గల శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. 40 స్టాళ్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ చేనేత వస్ర్తాలు, 20 స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఇతర రాష్ట్రాల చేనేత వస్ర్తాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు ప్రతి ఒకరూ చేనేత వస్ర్తాలు ధరించాలని కోరారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకుడు అశోక్‌రావు మాట్లాడుతూ, ఈనెల ఒకటి నుంచి 14వ తేదీ వరకు మేళా కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు సంపత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆపో మాజీ డైరెక్టర్ సత్యనారాయణ, టెసో డీఎంవో జనార్దన్, చేనేత సంఘం అధ్యక్షుడు రామచంద్రం, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత, జౌళి శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గంగాపరమేశ్వరాలయంలో పూజలు
కమాన్‌చౌరస్తా, మార్చి 1: జిల్లా కేంద్రంలోని సప్తగిరికాలనీలో గల గంగాపరమేశ్వరాలయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిని కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, బుచ్చిరెడ్డి సత్కరించారు.