జగిత్యాల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ);ప్రియమైన తోకలేని పిట్టకు నమస్కారం..మేమంతా బాగానే ఉన్నాం..నువ్వు మాత్రం మాకు ఒక తీపి గుర్తులా మిగిలిపోయావు..మొన్నటి వరకు మాతో అనుబంధాన్ని పెనవేసుకున్న నీవు, ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకున్నావు.. కష్ట సుఖాలను మోసుకొచ్చిన నీవు,సెల్ఫోన్లు, వాట్సాప్‌లు వచ్చాక చిన్నబోయావు..దూరదేశాన ఉన్న బిడ్డల క్షేమాన్ని చెప్పిన నీవు, ఆధునికతను సంతరించుకో‘లేఖ’ మాయమయ్యావు..నిన్నటి తరానికి మధుర జ్ఞాపకమైన నీవు,టెక్నాలజీ యుగంలో ఇమడ‘లేఖ’ ఎక్కడికో ఎగిరిపోయావు..సంతోషమొచ్చినా.. దుఃఖమొచ్చినా పలుకరించే నీవు,ఎదురుచూపులు మిగిల్చావు..
మనసైన మనిషికి మల్లే ఉత్తరం కోసం ఎదురుచూడడం ఒక చిత్రమైన అనుభూతి. ఒకానొక కాలంలో ఊహించి, శ్వాసించి, ఉద్వేగాలతో రాసిన రాతలు గత తాలూకు స్మృతులుగా మిగిలిపోయాయి. నాడు సన్నిహితులకు, మిత్రులకు రాసిన లేఖలు, ఉత్తరాలు చరిత్రను సృష్టించాయి. నెహ్రూ జైలు నుంచి ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలు అలాంటివే. జైలు పక్షులుగా ఉన్న వ్యక్తులు రాసిన ఉత్తరాలు బాహ్య ప్రపంచంలో నిప్పురవ్వలను వెదజల్లాయి. ఉద్యమానికి ఊపిరీగా నిలిచాయి. గాంధీ జైలులో ఉండి ప్రజలను ఉద్దేశించి రాసిన ఉత్తరాలు, ప్రజా సమూహంగా, మానవజాతిపై మహాత్ముడికి ఉన్న ప్రేమాభిమానాలకు అద్దంపట్టాయి. అభ్యుదయ సాహిత్య పోకడలతో ప్రేమ్ చంద్ రాసిన ఉత్తరాలు, సాహిత్య పరిమళాలను వెదజల్లాయి. ప్రపంచ ప్రజలను పీడన నుంచి విముక్తి కోసం ఉద్భవించిన కారల్ మార్క్స్ గతి తర్కిక భౌతిక వాదం ఉత్తరాల్లోనే పురుడు పోసుకుంది. జైలు జీవితం గడుపుతున్న కారల్ మార్క్స్, మరో కమ్యూనిస్టు యోధుడు ఏంగిల్స్కు రాసిన ఉత్తరాల్లోని అంశాలే తర్వాతికాలంలో గతి తర్కిక భౌతికవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఉత్తరాల ప్రహసనం, ఉద్వేగ, చైతన్య ప్రవాహం పెరిగి, పెరిగి చరిత్ర పోరాట విధానాన్ని మార్చి వేసింది. ‘ఉత్తరం విప్పాను.. వెన్నెల జలజల రాలింది’ అంటూ శేషేంధ్ర శర్మ రాసిన రమణీయ లేఖలు సాహిత్యాన్ని ఆవిష్కరించాయి. అలా మానవ జీవన క్రమంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరం నేటి ఆధునిక కాలంలో కొత్త పోకడలను పుణికిపుచ్చుకున్నది. ఇన్లాండ్ లెటర్, లిఫాలో వచ్చే ఉత్తరాలు, పోస్టుకార్డు ఉత్తరాలు కనుమరుగై, ఈ మెయిల్, వాట్సాప్ ఉత్తరాలు పుట్టుకొచ్చాయి.
ఉత్తరం.. పుట్టుక..
మానవ నాగరికత అభివృద్ధి చెంది, అక్షరాలు సృష్టించబడి, భాషకు ఒక రూపం వచ్చినప్పటి నుంచి ఉత్తరాల ప్రస్తావన ఆరంభమైంది. చరిత్రకు అందినంతలో క్రీస్తు పూర్వం 3,100 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన సుమేరియన్ నాగరికతలో ఉత్తరాల ఉనికిని తొలిసారిగా చరిత్రకారులు గుర్తించారు. మెసపుటోనియా నగరంలో ఉత్తరం ప్రస్తావన వచ్చింది. అయితే క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన మహారాణి ఆటోసియా ఉత్తరం తన ప్రజలను ఉద్దేశించి రాసినట్లుగా చరిత్రకారులు గుర్తించారు. దీనిని అతి పురాతన ఉత్తరంగా పేర్కొంటున్నారు. గ్రీకు భాషకు చెందిన లిటిర్రా అనే పదం నుంచి లెటర్ అనే ఇంగ్లిష్ అక్షరం పుట్టుకు వచ్చినట్లుగా చరిత్రకారులు రికార్డు చేశారు.
ఆధునిక భారతదేశంలో వాడకం
భారతదేశ చరిత్రలో కాగితాలపై ఉత్తరాలు రాసుకునే వ్యవస్థ బ్రిటీష్ కాలంలోనే ప్రారంభమైంది. బ్రిటీష్ వాళ్లు ఏర్పాటు చేసిన తపాలా శాఖ దేశ ప్రజల మధ్య సంబంధాలను పెంచింది. 1766లో వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో దేశంలో ఈస్టిండియా కంపెనీ నేతృత్వంలో కంపెనీ మెయిల్ పేరిట తపాల శాఖను సృష్టించారు. ఈ శాఖ మొదటి సారిగా మద్రాస్-కలకత్తా నగరాల మధ్య ఉత్తరాలను చేరేవేసే ప్రక్రియను చేపట్టింది. మరో వందేళ్లు గడిచిన తర్వాత లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో దేశం మొత్తం ఒకే పద్ధతిలో తపాలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చట్టం చేశారు. 1854 పోస్టల్ యాక్ట్ ద్వారా దేశంలో తొలిసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 1947 వరకు పోస్టల్ శాఖ బ్రిటీష్ పాలనలో ఉన్నా.. అనంతరం భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. మొదట్లో ఉత్తరాలను చేరవేయడమే లక్ష్యంగా పనిచేసినా.. తర్వాత అనేక కొత్త అంశాలను మొదలు పెట్టింది. మనియార్డర్లు, టెలిగ్రామ్‌లు, తదుపరికాలంలో పొదుపు వ్యవస్థలకు శ్రీకారం చుట్టింది. పోస్ట్‌కార్డు, ఇన్లాండ్ లెటర్, కవర్.. ఇలా ఉత్తరాలలో మూడు రకాలున్నాయి. ఇవన్నీ జాతీయ స్థాయిలో మనుగడలో ఉండగా, కవర్‌కు సంబంధించిన ఉత్తరం ఓవర్లాండ్ లెటర్‌గా మనుగడలో ఉంది.
పోస్ట్ కార్డు..
ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారంలో పోస్ట్ కార్డు ఒక తేలిక రకమైన ఉత్తరం. 1840లో తొలిసారిగా పోస్టల్ కార్డు వినియోగించబడింది. హ్యాండ్రైటింగ్తో లండన్‌కు చెందిన థియోడర్ హుక్ ఈ పోస్ట్‌కార్డును వినియోగించి, రవాణాకు పెన్నీ స్టాంప్‌ను వినియోగించాడు. ఇది ప్రపంచ చరిత్రలోనే తొలి పోస్ట్కార్డుగా గుర్తింపు పొందింది. దీనికి 2002లో అంతర్జాతీయ వేలంలో 31,750 యూరోల ధర పలికింది. లండన్‌లో ప్రారంభమైన పోస్ట్‌కార్డు పద్ధతి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినియోగించేందుకు అవకాశాలు కల్పించారు. దేశంలో మొదటి పోస్ట్‌కార్డు వినియోగం 1879లో ప్రారంభించారు. దేశీయంగా పోస్టల్ కార్డులకు స్టాంప్‌ల వినియోగం అవసరం లేకుండా ఒకే ధరతో విక్రయించే పద్ధతికి సైతం రూపకల్పన చేశారు. బ్రిటీష్ ఇండియా అణా పైసకు విక్రయించే పద్ధతిని తెచ్చింది. సాధారణ సమాచారం, జనులందరికీ తెలియాలనుకునే సమాచారం, కంపెనీలు, బ్యాంకులకు సంబంధించిన సమాచారం, ఇంటర్వ్యూల వంటి సమాచారం కోసం పోస్ట్‌కార్డును వినియోగించేవారు. అలాగే జన్మదిన శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలకు శతాబ్దంన్నర కాలం పాటు పోస్ట్కార్డులే ప్రధాన వాహకాలుగా మారాయి.
కవర్ (దేశీయ లేఖలు, అంతర్జాతీయ లేఖలు)..
ఉత్తరాలలో కవర్ అనేది అత్యంత కీలకమైనది. ఉత్తరాలలో తొలిసారిగా ఉపయోగించబడింది సైతం కవర్ ఉత్తరాలనే. కాగితంపై రాసి, కవర్లో ఉంచి, కవర్‌పై చిరునామా రాసి పంపించబడేదాన్ని కవర్ లెటర్ అని వ్యవహరించేవారు. పోస్టల్ శాఖ మొదట స్టాంప్‌లను ముద్రించి, వాటి ధరలను నిర్ణయించేది. పైసా, అణా, అర్ధ అణా, చార్అణా.. ఇలా స్టాంప్లకు ధర ఉండేది. కాగితాలపై ఉత్తరం రాసిన తదుపరి రాసిన ఉత్తరాన్ని కవర్లో ఉంచి సీల్ చేసేవారు. కవర్ బరువు, పంపే ప్రాంతం దూరం ఆధారంగా ఆ కవర్‌కు స్టాంప్‌లను పోస్టల్ శాఖ నిర్ణయించేది. పోస్టల్‌శాఖ నిర్ణయం ప్రకారం స్టాంప్‌లను కొనుగోలు చేసి, స్టాంప్‌లను కవర్‌పై అతికించి పోస్ట్‌బాక్స్‌లో వేసే పద్ధతి విశ్వవ్యాప్తంగా నిర్వహించబడింది. ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతున్నది. పోస్టల్‌శాఖ ఏర్పాటైన తొలి రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య మాత్రమే ఉత్తరాలు చేరవేసే పద్ధతి ఉండేది. క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని వారి మధ్య సైతం ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడ ప్రారంభమైంది. విదేశాలకు పంపే ఉత్తరాలను ఓవర్లాండ్ లెటర్లుగా పేర్కొనేవారు. మొదట్లో నౌకలు, స్టీమర్ల ఆధారంగా ఉత్తరాల రవాణా జరిగేది. మనదేశానికి సంబంధించి 1869లో బ్రిటీష్ మెయిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ లేఖలుగా చెప్పబడే ఓవర్లాండ్ లేఖల బట్వాడ ప్రారంభమైంది. ఈజిప్టు, ఎర్రసముద్రం, సూయజ్కాలువల మీదుగా బ్రిటన్, ఇండియా ప్రజల మధ్య లేఖల ప్రయాణం సాగేది. ఆ రోజుల్లో లేఖ లండన్ చేరాలంటే 35 నుంచి 45 రోజులు పట్టేది. విమాన సర్వీస్‌లు ప్రారంభమైన తదుపరి అంతర్జాతీయ ఉత్తర, ప్రత్యుత్తరాల వ్యవహారం సులువైంది.
ఇన్లాండ్ లెటర్..
స్వతంత్ర భారతదేశంలో పోస్టల్‌శాఖ దేశీయంగా ఒక ప్రత్యేక ఉత్తరం ఉండాలని భావించింది. దీని కోసం పోస్టాఫీస్ యాక్ట్ 1898కి సవరణ చేస్తూ పోస్టల్ స్టాంప్స్‌ను అంటించాల్సిన అవసరం లేకుండా పోస్ట్‌కార్డు కంటే ఎక్కువ వివరాలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ, రాసిన లేఖ సారాంశం రహస్యంగా ఉండే విధంగా ఉండే ఇన్లాండ్ లెటర్‌కు రూపకల్పన చేయాలని భావించారు. 1950లో ప్రారంభమైన భారతీయ పోస్టల్ శాఖ, 1969లో తొలిసారిగా ఇన్లాండ్ లెటర్‌ను సృష్టించింది. అప్పటి నుంచి దాదాపు అరశతాబ్దానికిపైగా ఈఇన్లాండ్ లెటర్ మనుగడలో ఉన్నది.
పోస్టల్ స్టాంప్స్..
ఉత్తరాల ప్రక్రియలో పోస్టల్ స్టాంప్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాన్ని చేరవేసేందుకు కవర్లపై అతికించేందుకు స్టాంప్‌లు సృష్టించారు. భారతదేశంలో విక్టోరియా రాణి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటోతో తొలి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. కాలక్రమంలో స్టాంప్‌ల ముద్రణ పెరిగింది. వివిధ ధరల్లో స్టాంప్‌లను ముద్రించే ప్రక్రియ మొదలైంది. స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ రాజ్యాధికారాన్ని స్ఫురింపజేసే ఫొటోలతో స్టాంప్‌లు ముద్రించబడేవి. స్వతంత్ర భారతదేశంలో పోరాట యోధుల నుంచి మొదలు కొని, భారతీయ తత్వం, ఔన్నత్యం, కట్టడాలు, వ్యక్తులు, ఘనత తదితర అంశాలను ఇతివృత్తంగా తీసుకొని స్టాంప్‌ల ముద్రణ చేస్తున్నారు. ఇప్పటికీ స్టాంప్‌ల ముద్రణ కొనసాగుతూనే ఉంది. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగి, ప్రపంచ ప్రజలందరినీ ఏకం చేసిన ఘనత ఉత్తరానికి దక్కింది.
ఇమడ‘లేఖ’..
తోక లేకుండా ‘తొంభై యోజనాలు పయనించేది’ అని పొడుపుకథగా చెప్పుకొన్న ఉత్తరం ప్రజల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పింది. ఆపదకు, సంపదకు, యోగ క్షేమాలకు, రాజకీయాలకు, సమాచారానికి, విరహ వేదనలకు అద్దం పట్టిన ఉత్తరం. సాహిత్యంలో సైతం ఒక ప్రక్రియగా మారిపోయింది. అందమైన చేతిరాతతో, అంతకంటే అందమైన మనసుతో మనోహరంగా, రసరమ్యంగా ఉత్తరాలు రాయడం ఒక గొప్ప కళగా కీర్తించబడింది. ప్రపంచ ఎల్లలు చెరిపివేసి, ప్రజల అభిప్రాయాలను జగతి నలుచెరుగుల ప్రవహింపజేసిన ఉత్తరం నేడు కనుమరుగైంది. ఆ ఉత్తరాల మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో లేఖలు కనిపించకుండాపోయాయి.