ప్రతి ధాన్యం గింజనూ కేంద్రం కొనాల్సిందే.. రాష్ట్రంలో మొత్తం వడ్లు కొనేదాకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. రైతులను ఆగం చేస్తే బీజేపీనే ఆగం చేస్తాం.. బండీ.. నీకు నిజాయితీ ఉంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించు. తెలంగాణ భారతదేశంలో లేదా?, మేం ఈ దేశ పౌరులం కాదా?
– రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రైతుపై కేంద్రం వివక్షకు నిరసనగా టీఆర్ఎస్ సర్కారు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నది. ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్న బీజేపీ సర్కారు మెడలు వంచేందుకు అన్నదాతలతో కలిసి పోరుబాట పడుతున్నది. ‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’ నినాదంతో ఆహార ధాన్యం సేకరణలో ఒకటే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ నినదిస్తున్నారు. రైతన్న ప్రయోజనం కోసం ఏకంగా ఢిల్లీపై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీ దద్దరిల్లేలా నిరసనలు తెలుపాలని, రైతులను జాగృతం చేసి భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు, చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు.
పెద్దపల్లి, మార్చి 23(నమస్తే తెలంగాణ): ప్రతి ధాన్యం గింజనూ కేంద్రమే కొనాల్సిందేనని, రాష్ట్రంలో మొత్తం వడ్లు కొనేదాకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి బుధవారం మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ వరికి యోగ్యమైన రాష్ట్రమని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులకు అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆగం చేయాలని చూస్తున్నదని, కానీ ఆగమయ్యేది బీజేపీనేనని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ భారతదేశంలో లేదా?, మేం ఈ దేశ పౌరులం కాదా? మా తెలంగాణ రైతులు ఏం పాపం చేసిండ్రు’ అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైసా.. రా రైసా.. కాదని, ఆర్ఎస్పీ ఇచ్చింది వడ్లపైనేనని, వడ్లు కొనాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ వివక్ష చూపుతున్నదన్నారు. పంజాబ్, ఇతర మరికొన్ని రాష్ర్టాల్లో పండిన పంటనంతా కొనుగోలు చేస్తూ.. తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశం మొత్తం ఒకటే కొనుగోలు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు చేపట్టాలని సవాల్ విసిరారు. రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. బీజేపీ నేతలను నిలదీద్దామని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ధాన్యం కొనుగోళ్ల ఉద్యమాన్ని చేపడుదామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రతీ రైతు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం నగరమేయర్ డా. బంగి అనీల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, జడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, ఆముల నారాయణ, బండారి శ్రీనివాస్, ఉప్పు రాజ్‌కుమార్ ఉన్నారు.
రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టే వరకూ నిరసన కార్యక్రమాలు చేపడుతామని టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సమావేశాలను నిర్వహిస్తామని, పంజాబ్ తరహాలో వరిధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 2న ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండాను ఎగురవేయాలని, ఆ తర్వాత రహదారుల దిగ్బంధం, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలను నిర్వహిస్తామని చెప్పారు.