సమస్త జనులకు విజ్ఞానాన్ని ప్రసాదించి సమాజంలో ఉన్నతులుగా నిలబెట్టే గ్రంథాలయం.. కొలువుల కార్ఖానాగా మారుతున్నది. సమైక్య పాలనలో అనేక సమస్యలతో చిక్కి శల్యమైన విజ్ఞాన భాండాగారం.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చర్యలతో కొత్తరూపుదాల్చింది. ఆధునిక హంగులు, సకల వసతులు.. లక్షలాది పుస్తకాలను సమకూర్చుకొని ఉద్యోగాల సాధన కేంద్రంగా నిలుస్తున్నది. రాష్ట్రం వచ్చాక ల్రైబ్రరీల్లో చదివిన ఎంతో మంది జాబ్స్ సాధించగా, తాజాగా రాష్ట్ర సర్కారు ఉద్యోగాల ప్రకటనతో తాకిడి పెరిగింది. స్టడీ మెటీరియల్ సహా కాంపిటీటివ్ మెటీరియల్ సైతం అందుబాటులో ఉంటుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. ఇంకా అవసరమైన బుక్స్‌ను ఇండెంట్ పెట్టి మరీ అప్పటికప్పుడే తెప్పిస్తుండడంతో 90 శాతం ప్రిపరేషన్ పుస్తకశాలల్లోనే జరుగుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రంథాలయాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లైబ్రరీలపై దృష్టి సారించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం, ఆధునిక సౌకర్యాలతో మౌలిక వసతులు కల్పించడం, అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు వంటివి చేశారు. ఫలితంగా పాఠకుల సంఖ్య పెరగడంతో విస్తృతంగా పేపర్లు, బుక్స్ కొన్నారు. ఉద్యోగార్థుల కోసం స్పెషల్ పేపర్, బుక్, కంప్యూటర్ సెక్షన్, రీడింగ్ హాల్ వంటి గదులు నిర్మించారు. ఏసీలు, వైఫై వంటి సౌకర్యాలు కల్పించారు. మహిళలకు ప్రత్యేక రీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. డిజిటల్ పాఠాలు చదువుకునే అవకాశం కూడా కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాత పుస్తకాలు మాత్రమే చదువుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు లైబ్రరీలకు వచ్చే వారు కోరుకున్న పుస్తకాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఇందు కోసం ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ద్వారా రిజిస్ట్టర్‌లో పాఠకులు, నిరుద్యోగులు తమకు అవసరమైన పుస్తకం పేరు రాస్తే అధికారులు వాటిని మార్కెట్లో కొనుగోలు చేసి లైబ్రరీలో అందుబాటులో పెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో రోజూ గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అభ్యర్థులు కూడా ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడి చదువుతున్నారు.
గ్రంథాలయాలు.. కొలువుల కేంద్రాలుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న లైబ్రరీ భవనాలు స్వరాష్ట్రంలో ఆధునికతను సంతరించుకున్నాయి. డిజిటల్ హంగులతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కోట్లాది రూపాయలతో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు లక్షలాది బుక్స్‌ను అందుబాటులో పెట్టడడంతో 90 శాతం ప్రిపరేషన్ అంతా అక్కడే జరుగుతున్నది. గ్రంథాలయాల్లో చదివిన ఎంతో మంది ఉద్యోగాలు సాధించగా, తాజాగా.. ఉద్యోగాల ప్రకటనతో తాకిడి పెరిగింది. పుస్తకశాలలకు క్యూ కడుతున్నారు. ఆధునిక వసతులు, లక్షలాది పుస్తకాలతోపాటు ప్రత్యేక రీడింగ్ రూమ్స్ కూడా ఉండడంతో మహిళలూ అధికంగా వస్తున్నారు. ఇంకా.. ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ద్వారా అభ్యర్థులు కోరుకున్న బుక్స్‌ను సిబ్బంది అందుబాటులో పెడుతున్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం త్వరలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసుశాఖ-జిల్లా గ్రంథాలయ పరిషత్’ సంయుక్తంగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారుగా 3 నెలలు ఉండే శిక్షణ తరగతులకు హాజరయ్యే అభ్యర్థులతో పాటు ఇతర జాబ్స్ అభ్యర్థులకు ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రంథాలయంలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టాస్క్ సెంటర్ వరంలా మారింది. ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి ప్రత్యేక చొరవతో గ్రంథాలయంలో టాస్క్ సెంటర్‌ను నెలకొల్పారు. ఇక్కడ ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్కిల్స్ డెవలప్మెంట్పై శిక్షణ అందిస్తున్నారు.
నేను పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నా. పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్లో రిటైర్డ్ ఆర్మీ అధికారి రాజు ప్రోద్బలంతో ప్రతి రోజూ ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేస్తున్నా. ఆయన సూచనల మేరకు కానిస్టేబుల్ ఉద్యోగానికి అవసరమయ్యే అన్ని పుస్తకాలను లైబ్రరీలో చదువుతువున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి ఇన్నివేల పోస్టులకు ప్రకటన చేయడం సంతోషంగా ఉంది. ఈసారి జాబ్ సాధిస్తాననే నమ్మకం ఉంది.
-గండు మనోజ్, రంగంపల్లి పెద్దపల్లి మండలం
మాది రామగిరి మండలం బేగంపేట. నేను బీటెక్‌లో ఎలక్ట్రికల్స్ పూర్తి చేశా. నాన్న వ్యవసాయం, అమ్మ గృహిణి. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నా. అనుకున్నట్టుగానే సీఎం సార్ జాబ్స్ ప్రకటన చేశారు. అప్పటి నుంచి క్షణం వృథా చేయకుండా ప్రిపేరవుతున్నా. ప్రతి రోజూ ఉదయం మా ఊరి నుంచి బస్సులో మంథనికి వచ్చి రాత్రి దాకా చదువుకొని ఇంటికి వెళ్తున్నా. తప్పకుండా గ్రూప్-2 ఉద్యోగం సాధిస్తా.
– డేగ రాజు, బేగంపేట, రామగిరి మండలం
నేను డీఎస్సీ, టీఆర్టీకి ప్రిపేరవుతున్నా. నెల రోజుల నుంచి గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వస్తున్న. అవసరమైన కాంపిటీటివ్ పుస్తకాలను చదువుతున్న. మొన్నటి వరకు మార్కెటింగ్‌లో ఉద్యోగం చేసే వాడిని. కానీ, సీఎం కేసీఆర్ సార్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని ముందు నుంచీ చెబుతుండడం, ఇటీవల జాబ్స్ వేకెన్సీ ప్రకటన చేయడంతో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉండి చదువుకుంటున్నా. తప్పకుండా ఉద్యోగం సాధిస్తా.
-మోటపలుకుల రవీందర్, (పెద్దపల్లి)
పెద్దపల్లి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలోని గ్రంథాలయాలు ఆధునిక హంగులు.. సకల వసతులు.. వేలాది పుస్తకాలతో అలరారుతున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం, మంథని, రామగుండం, సుల్తానాబాద్ గ్రంథాలయాలు కొలువుల సాధన కేంద్రాలుగా మారాయి. ఈ నాలుగు లైబ్రరీల్లో అధికారులు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా కాంపిటీటివ్ బుక్స్, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చారు. వీటితోపాటు గోదావరిఖని బ్రాంచ్ గ్రంథాలయంలో మూడు కంప్యూటర్లు, మంథని బ్రాంచ్ గ్రంథాలయంలో రెండు, పెద్దపల్లిలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో ఒకటి, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఒక కంప్యూటర్ను అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ ద్వారా వారికి కావాల్సిన ప్రతి పుస్తకం అందేలా చొరవ చూపుతున్నారు.
కాంపిటేటివ్ పరీక్షలు రాసే అభ్యర్థుల తాకిడి పెరగడం, లెక్కకు మించిన అభ్యర్థులు వస్తుండడంతో పుస్తకాల కొరత ఏర్పడుతుండగా, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన పుస్తకాలు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలోని 10 గ్రంథాలయాల్లో 20,478 పుస్తకాలు ఉండగా, అందులో 4832 కాంపిటీటివ్ బుక్స్ ఉన్నాయి. ఇక లైబ్రరీల్లో 8,180మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. కాగా, జిల్లాలోని గ్రంథాలయాల్లో ప్రిపేరయిన వారిలో దాదాపు 10 మంది వరకు జాబ్స్ కొట్టారని చైర్మన్ తెలిపారు.
ఉద్యోగాల ప్రకటన వెలువడిన నేపథ్యంలో లైబ్రరీలకు వచ్చే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో వారందరికీ అవసరమయ్యే కాంపిటీటివ్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను వారం పదిరోజుల్లో తెప్పిస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిని సమకూర్చుతున్నాం. కోరిన బుక్ తెప్పించేందుకు ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపిస్తున్నాం. వచ్చే నెల నుంచి పనివేళలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తాం. వేసవి దృష్ట్యా నియోజకవర్గ కేంద్రాల్లోని మూడు గ్రంథాలయాల్లో ఎయిర్, వాటర్ కూలర్లు, సరిపడా కుర్చీలను అందుబాటులో ఉంచుతున్నాం.
– రఘువీర్ సింగ్, చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ,
(పెద్దపల్లి )
సిరిసిల్ల టౌన్, మార్చి 23: పోటీ పరీక్షలకు అవసరమయ్యే కాంపిటీటివ్ బుక్స్, సాహితీ ప్రియులకు సాహిత్య పుస్తకాలు.. చిన్నారులకు బాలకవితలు, బాలశిక్షలు.. డిజిటల్ లైబ్రరీలు, పాఠకుల కోసం అన్నిరకాల దినపత్రికలు.. ఇలా లక్షలాది పుస్తకాలతో జిల్లా కేంద్ర గ్రంథాలయం విజ్ఞానపరిమళాలు వెదజల్లుతున్నది. నిత్యం ఎందరో యువకులు, మేధావులకు ఆలవాలంగా విరాజిల్లుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రంలో రూ.3.60 కోట్ల వ్యయంతో ఆసియాటిక్ లైబ్రరీ తరహాలో డిజిటల్ సొబగులతో నిర్మించారు. సిరిసిల్ల పట్టణంలో దశాబ్దాల కింద ఏర్పాటు చేసిన గ్రంథాలయం మొన్నటిదాకా తాత్కాలిక భవనంలో నడిచేది. అరకొర పాఠ్యపుస్తకాలు, సాహిత్యం, దినపత్రికలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా శిథిలావస్థకు చేరినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆధునిక లైబ్రరీకి రూ.3.60 కోట్లు మంజూరు చేయగా, నిపుణుల పర్యవేక్షణలో తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మించారు. సినీగేయ రచయిత డాక్టర్ సీ నారాయణరెడ్డి పేరు పెట్టారు.
దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన సినారె జిల్లా గ్రంథాలయంలో అమాత్యుడి సహకారంతో ఆధునిక వసతులు కల్పించారు. ముంబైలోని ఆసియాటిక్ లైబ్రరీ తరహాలో డిజిటల్ సొబగులు అద్దారు. విశాలమైన ఆవరణ, ఆహ్లాదకరమైన వాతావరణంలో మూడు అంతస్తులలో నిర్మించిన ఈ భవనంలో కంప్యూటర్ ల్యాబ్, సెంట్రల్ ఏసీ సౌకర్యం, రీడింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్, సెల్లార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యాలను కల్పించారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులతోపాటు పరీక్షలకు హాజరయ్యేందుకు 20 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి వచ్చే పిల్లలకు ప్రత్యేక శిక్షకుడి ద్వారా బోధిస్తున్నారు. అలాగే, ఉద్యోగార్థుల కోసం అన్ని రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చారు. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, కరెంట్ అఫైర్స్, పోలీస్, టీచర్ ఉద్యోగాలు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అన్ని బుక్స్‌తోపాటు సాహిత్య నవలలు, దినపత్రికలు మొత్తం 29,500 పుస్తకాలు ఉన్నాయి. దీంతో నిత్యం పెద్ద సంఖ్యలో పాఠకులు, నిరుద్యోగులు గ్రంథాలయానికి వస్తున్నారు. ఇంకా పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు రెండు విశాలమైన ప్రత్యేక గదులు ఇక్కడ ఉండగా, నిత్యం సుమారుగా 200 మందికి పైగా అభ్యర్థులు వస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సినారె లైబ్రరీ నిరుద్యోగులకు వరంలా మారింది. గ్రంథాలయంలో ఆధునిక సౌకర్యాలు, ప్రత్యేక రీడింగ్ రూంలు ఉన్నాయి. అభ్యర్థులకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, టీచర్ కొలువులకు సంబంధించిన అన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఆన్లైన్ తరగతుల కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాం. పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
– ఆకునూరి శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ (రాజన్న సిరిసిల్ల)