శ్రీరాంపూర్, మార్చి 23 : ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును పోరాటాలు చేసి గద్దె దించాలని కార్మికులు, ప్రజలకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీ ఈ నెల 21న చేపట్టిన జీపు యాత్ర బుధవారం శ్రీరాంపూర్ చేరుకున్నది. ఉదయం ఆర్కే-6, ఎస్సార్పీ -3 గనులపై యాత్ర నిర్వహించారు. ముందుగా శ్రీరాంపూర్ కాలనీలోని కార్మికుడి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో కేంద్ర ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, శంకర్రావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి గనులు, ఎల్ఐసీ, విమానయానం, ఓడరేవులు, రైల్వే, బీహెచ్ఈల్, హెచ్‌పీసీఎల్, బ్యాంకులను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్నదని ఆరోపించారు. నరేంద్ర మోదీ సింగరేణి గనులను అదానీ, అంబానీకి అమ్ముతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో సింగరేణి పేరు కనుమరుగై అంబానీ పరిశ్రమగా మారుతుందని ఆరోపించారు. గనుల రక్షణకు ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కేవీ ప్రతాప్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి రాజమౌళి, రాజేందర్, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి, నాయకులు సమ్మురాజయ్య, నరేందర్‌నాయుడు, ప్రకాశ్, తిరుపతి, రామారావు పాల్గొన్నారు.
గోదావరిఖని, మార్చి 23 : రీజియన్-1 పరిధి జీడీకే-11ఏ గని వద్ద తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సం ఘం(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఈ నరేశ్, ఎస్సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ అశోక్, టీజీఎల్బీకేఎస్ రిజీయన్ అధ్యక్షుడు ఎం కొమురయ్య, కార్యదర్శి ఎన్సీ బాబు, ఉపాధ్యక్షుడు ఎండీ యూసుఫ్, మొండన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
జీడీకే 2ఏ గనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. యూనియన్ నాయకులు మెండె శ్రీనివాస్, ఆసరి మహేశ్, రాములు, శివారెడ్డి, దుర్గాప్రసాద్, యాదగిరి చంద్రారెడ్డి, కనకయ్య, నారాయణ, పురుషోత్తం తదితరులు ఉన్నారు.
రామకృష్ణాపూర్, మార్చి 23 : దేశవ్యాప్త సమ్మెకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ వివరించారు. రామకృష్ణాపూర్ ఉపరితల గని ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు బడికెల సంపత్‌కుమార్, రీజియన్ కార్యదర్శి వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.