కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు కావాలి.. అది ఒకప్పటి మాట. చేయాలన్న తపన, చేయాల్సిన పనిపై చిత్తశుద్ధి, పక్కాప్రణాళిక, ప్రజలకు వీలైనంత తొందరగా ఫలాలు అందించాలన్న సంకల్పం ఉంటే ఏ ప్రాజెక్టునైనా సరే.. రెండు మూడేండ్లలో కట్టి చూపవచ్చని నిరూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గోదావరి నదిపై మేడిగడ్డ నుంచి ప్రస్థానం ప్రారంభించి, అనతికాలంలోనే అనేక ప్రాజెక్టులను నిర్మించి.. కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ వరకు కేవలం ఐదేండ్లలో జలాలను తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన సమయంలో ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలాయి. కాళేశ్వరం నుంచి నీరు తెచ్చి ఒక్క ఎకరానికి నీరిచ్చినా మేం దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరిసాయి. కానీ, అవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అపరభగీరథుడిలా ముందుకు సాగారు. ఒక బృహత్తరమైన సంకల్పంతో ప్రాజెక్టులను నిర్మిస్తూ వచ్చారు. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లే కాదు, ఆసియాలోనే అదిపెద్ద పంప్‌హౌస్‌లను నిర్మించారు. బాహుబలి మోటార్లను వినియోగించారు. కేవలం మూడేండ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, 2019 జూన్ 21న జాతికి అంకితం చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎత్తిపోతల పథకం ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నది. లక్ష్మీ బరాజ్ నుంచి నేడు జాతికి అంకితమవుతున్న మల్లన్నసాగర్ జలాశయం వరకు.. ప్రతిపనిలోనూ ఎన్నో అబ్బుర పరిచే రికార్డులు కనిపిస్తాయి. 130 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదిని సజీవంగా మార్చడమే కాదు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా 120 కిలోమీటర్ల పొడవున వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా చేసిన ఘనత ఈ పథకం కిందకే వస్తుంది. ఎల్ఎండీ చరిత్రలోనే ఈ రిజర్వాయర్ నుంచి దిగువకు అత్యధికంగా 55 టీఎంసీలకుపైగా నీటి విడుదల చేశారు. సుమారు 155 రోజుల పాటు కాకతీయ కాలువకు నిరంతరాయంగా నీటి విడుదల చేసిన రికార్డు పొందారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 పరిధిలోని అన్ని చెరువులను నింపడం కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి గతేడాది నీళ్లు ఇచ్చారు. ఇదంతా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా జరిగిన రికార్డులే.
‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మా కరువును తరిమేయడానికి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే మా ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చడానికి.. ఆరు నూరైనా సరే.. సమైక్య రాష్ట్రంలోనే కృష్ణ, గోదావరిలో కలిపి మాకు అధికారికంగా కేటాయించిన 1300పై చిలుకు టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకొని తీరుతుంది. ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. దీనిని ఎవ్వరూ ఆపలేరు. పిచ్చి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా మానుకోవాలి.’
– 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్‌కు పునాదిరాయి వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలివి.
నేడు మరో చారిత్రక ఘట్టం
మేడిగడ్డ బరాజ్ నుంచి చివరి వరకు చూస్తే సుమారు 18 జలాశయాలు నిర్మాణం చేస్తున్నారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీటిని అవసరాల మేరకు ఆయా జలాశయాల్లో నిల్వ ఉంచాలన్న లక్ష్యంతో వీటిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో గుట్టల మధ్య నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ అతి పెద్దది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ ఇదే పెద్దది. అత్యంత కీలకమైనది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమైన ఈ ప్రాజెక్టు సాగు, తాగునీటి రంగంలోనూ నూతన చరిత్ర సృష్టించనుంది. అత్యంత ఎత్తున నిర్మించిన జలాశయంగా ప్రత్యేకతను పొందింది. డ్యాం ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మల్లన్నసాగర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఈ నెల 23న) జాతికి అంకితం చేయనున్నారు. మల్లన్నసాగర్ జలాశయంతో సాగు, తాగునీటి అవసరాలు తీరిపోనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.