వెల్గటూర్, జూలై 22 : 70 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతమంతా దుమ్ము కొట్లాడిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 26 మందికి 26 లక్షల29 వేల16 విలువైన చెక్కులను ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ కునమల్ల లక్ష్మితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఆ ఫలాలు తెలంగాణలోని ప్రతి ఇంటికి కనీసం రెండూ తగ్గకుండా అందుతున్నాయని అన్నారు. బడాయి మాటలు మాట్లాడే మోదీ సొంత రాష్ట్రంలో ఇచ్చే పింఛన్ 800లే అని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ర్టాల్లో మన తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. అభివృద్ధి నిరోధకులు పనిగట్టుకొని మభ్యపెట్టి మారేడు కాయ చేస్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధారాణి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, పాక్స్ చైర్మన్ రాంరెడ్డి, తహసీల్దార్ ఉయ్యాల రమేశ్, ఎంపీడీవో సంజీవరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు సింహాచలం జగన్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, నాయకులు మూగల సత్యం, రాజేశ్వర్రెడ్డి, మహిళ నాయకులు ముంజాల మంగ పాల్గొన్నారు.
అమ్మ బాగున్నారా.. ?
ఇటీవల కురిసిన వర్షాలకు స్తంభంపల్లి ఊర చెరువు మత్తడి దుంకి వరద ప్రవహించి స్థంభంపల్లి-వెంకటాపూర్ గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బతినగా మంత్రి శుక్రవారం పరిశీలించారు. చెరువు వద్ద నిలబడి ఉండగా వరి నాటుకు వెళ్లి వస్తున్న మహిళలను పలకరించారు. అమ్మ బాగునారా..?… వరి నాటు వేస్తే కూలీ ఎంత గిట్టుబా టు అవుతుందని ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న మహిళలు సంబురంగా మంత్రితో మాట్లాడారు.