కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణప్రతినిధి)/ పెద్దపల్లి (నమస్తే తెలంగాణ) : దశాబ్దాలపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును హేళన చేస్తూ ఇటీవల పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం రావాల్సిన నిధులు, నీళ్లు కేటాయింపుల వంటివి చేయకపోగా, ఏకంగా తెలంగాణ ఆవిర్భావం సరిగా జరగలేదంటూ బీజేపీ అధినాయకత్వం మాట్లాడిన మాటలపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. దీనిని కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పడరాని పాట్లు పడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులను జనం నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని అలా మాట్లాడితే.. ‘మీరెందుకు స్పందించడం లేదు’ అంటూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అంతర్మథనం చెందుతున్నారు.
ఆరని అసంతృప్తి జ్వాల..
స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లాలోనే బీజేపీ సీనియర్ నాయకులు ఆయనపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. సీనియర్లంతా మీటింగ్ పెట్టుకొని అసంతృప్తిని వెళ్లగక్కడమే కాదు, జిల్లాలో జరుగుతున్న నియంత పోకడలను కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర నేతలు కొంత మందిని పిలిచి సదరు నాయకులతో మాట్లాడగా.. వారికి జరిగిన అన్యాయాన్ని విప్పి చెప్పారు. తమకు పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేయడమే కాదు, అదే బాటలో సాగుతున్నారు.
పెద్దపల్లిలో గ్రూపుల హోరు..
ఒకవైపు పార్లమెంట్లో రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీలో కలకలం రేగుతున్నది. ఇదే సమయంలో సింగరేణి బొగ్గు గనుల వేలం తీరుపై కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోవైపు గ్రూపు రాజకీయాలతో నేతలు సతమతవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడేందుకు పలువురు నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్ రాజీనామా చేసి, ప్రధాని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరును ఎండగట్టారు. అదే బాటలో నడిచేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ గ్రూపుల హోరు సాగుతున్నది. మూడు నియోజకవర్గాలు.. ఆరు గ్రూపులు అన్నట్లుగా చర్చ జరుగుతున్నది. దీనికి తోడు మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరిన నాటి నుంచి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటుండడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది.
రెండున్నరేళ్ల క్రితం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను నియమించారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించేందుకు సిద్ధపడి ఒక జాబితాను రాష్ట్ర పార్టీకి పంపించారు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీని ఆమోదించకపోవడంతో అసంతృప్తికి గురైన సోమారపు జిల్లా పార్టీ పదవికి రాజీనామా సమర్పించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దానిని ఆమోదించలేదు. అప్పటి నుంచి కొత్త కార్యవర్గానికి రూపం లేదు. దీంతో అసలు సోమారపు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడా..? లేడా..? తెలియక పార్టీలోని క్యాడర్ సతమతమవుతున్నారు. జిల్లా కార్యవర్గంలో చోటు లభిస్తుందని ఆశించిన కార్యకర్తలు అవకాశం రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ కారణంగానే జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో బీజేపీ రోజురోజుకూ బలహీన పడుతూ వస్తున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుసార్లు జిల్లాలో పర్యటించినప్పటికీ ఒకరు వస్తే మరొకరు రాని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ మధ్య వార్ కొనసాగుతున్నది. పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో బీజేపీలో నాలుగు వర్గాలు కొనసాగుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, కౌశిక్ హరి ఎవరికి వారే పార్టీలో కొనసాగుతుండగా, మాజీ ఎంపీ వివేక్ మరో వర్గాన్ని ప్రోత్సహిస్తూ రాజకీయాలు నెరుపుతున్నారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జిగా రేండ్ల సనత్‌కుమార్ కొనసాగుతుండగా, మాజీ ఎంపీ వివేక్.. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డిని పార్టీలోకి చేర్పించడంతో అక్కడ ఆ రెండు వర్గాల మధ్య వైరం పెరిగింది.
దీనికి తోడు ఈ రెండు వర్గాలకు సంబంధం లేకుండానే మాజీ ఎంపీ వివేక్ నేరుగా మరో వర్గాన్ని సైతం ప్రోత్సహిస్తుండడంతో అక్కడ కమలం రాజకీయం రసవత్తరంగా మారింది. పైగా బండి సంజయ్, వివేక్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తుండగా, ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఇటీవల మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అగ్గిరాజేశాయి. ఉద్యమాన్ని మోదీ అవమానించిన తీరు.. తెలంగాణ రాష్ట్రంపై చూపుతున్న వివక్షను గమనిస్తున్న ఆ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా కమలం గూటి నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్ రాజీనామా చేసి ప్రధాని, బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేయడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.
సింగరేణి బీజేపీలోనూ అసంతృప్తి..
మద్ది శంకర్ రాజీనామా చేసి ప్రధాని, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేయగా, ఆ ప్రభావం పెద్దపల్లి జిల్లాలోనూ కనిపించనున్నది. కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కేకే 6గనులను వేలం వేయకుండా సింగరేణికి అప్పగించాలని, ప్రైవేటీకరించవద్దని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కోరినా ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంపై నల్లనేలలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రామగుండం, గోదావరిఖని, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3పరిధిలోని కార్మికులు, కార్మిక సంఘా లు సైతం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. కార్మికులు మూడు రోజులు సమ్మె చేసినా.. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నదే తప్ప.. ఆ గనుల వేలాన్ని నిలిపివేయకపోవడంపై సింగరేణి ప్రాంతాల్లోని బీజేపీ క్యాడర్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. మోదీ వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వ చర్యలతో పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడేందుకు క్యాడర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. సోమారపు రాజీనామా చేసినా ఆ మోదించకుండా కాలం గడుపుతుండగా.. మాజీ ఎంపీ వివేక్ జిల్లా వ్యాప్తంగా ఒంటరిగా తనకం టూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో కమల దళం మండిపడుతున్నది.