జ్యోతినగర్, ఫిబ్రవరి 22: ఆంగ్ల విద్య, సకల వసతులతో ఆ పాఠశాల సక్సెస్ బాటలో పయనిస్తున్నది. 2008లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ఏటేటా ప్రవేశాలు జోరుగా పెరుగడంతో నిండా పిల్లలతో కళకళలాడుతున్నది. సకల సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తుండడంతో కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నది. ఉపాధ్యాయుల కృషితో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాలోని మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది ఎన్టీపీసీ జిల్లా పరిషత్ స్కూల్.
ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 2008 నుంచి ఆంగ్ల బోధన చేపట్టడంతో సర్కారు బడిపై తల్లిదండ్రులకు ఆసక్తి పెరుగడంతో ఏటేటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ బడిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏ పాఠశాలలో లేని సకల వసతులు ఉన్నాయి. అధునీకరణ భవనంలో 24 తరగతి గదులు, 27 మంది ఉపాధ్యాయులు, 561మంది విద్యార్థులతో ఈ బడి కిటకిటలాడుతున్నది. విద్యార్థులకు నాణ్యమైన బోధన తరగతులతోపాటు డిజిటల్ బోధన అందిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ముందుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రతి తరగతి గదిలో విశాలమైన కుర్చీలు, టేబుళ్లు, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా, తాగు నీటి వసతి, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఆహ్ల్లాదకరంగా క్రీడామైదానం. పార్కింగ్ వసతి. ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తూ ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తున్నారు. ఎక్కడ లేని విధంగా పాఠశాలలో వృత్తి విద్యా కోర్సుతో ఉపాధ్యాయుల బోధన ఇక్కడి విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతున్నది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ద్వారా రోజుకు 70-80కిలోల బియ్యంతో విద్యార్థులకు పగటి పూట కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుతో సన్నబియ్యం పంపిణీతో ప్రత్యేక వంటగదిలో వంటను తయారు చేసి తాజా కూరగాయలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. స్థానిక ఎన్టీపీసీ సహకారం లభించడంతో స్కూల్‌కు సకల వసతులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల ద్వారా పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులను సమకూర్చుకుంటున్నారు.
స్కూళ్లకు పూర్వవైభవం
మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ పేరిట నిధులు విడుదల చేయడం హర్షణీయం. దీంతో సర్కారు బడులకు పూర్వవైభవం రానుంది. ఆంగ్లం బోధనతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఆంగ్ల విద్యతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ బడిపై ఆసక్తి పెరిగింది. ఇటీవలే ఎమ్మెల్యే నిధుల నుంచి కంప్యూటర్ ల్యాబ్‌కు కొత్త కంప్యూటర్లు, డిజిటల్ బోధన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు ఎన్టీపీసీ సీఎస్ఆర్ సహకారం అందిస్తున్నది. -ఎస్ వెంకటేశ్వర్లు, ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం