కార్పొరేషన్, ఫిబ్రవరి 22: మొన్నటిదాకా పట్టణాలు, గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడమంటే పెద్ద నరకం. ఆరడుగుల జాగ వెతుక్కోవాల్సిన దైన్యం. ఖాళీ స్థలాలు.. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్తే.. ఎవరొచ్చి అడ్డుకుంటారో, ఇక్కడొద్దు పొమ్మంటారోనని భయం. మనిషి చనిపోయిన బాధ కన్నా ‘అంతిమ కార్యక్రమం’ ఎట్లా అన్న చింతే ఎక్కువ. ఎక్కడో శివారులో దహనం చేసేవారు. ఇన్ని గోసలు పడ్డ పల్లె, పట్టణాల్లో ఇప్పుడు ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు కోట్లాది నిధులు వెచ్చించి ఆధునిక హంగులతో నిర్మిస్తున్న వైకుంఠధామాలతో ఆఖరి ప్రస్థానం చింత లేకుండా జరిగిపోతున్నది. ఇందుకు కరీంనగర్‌లోని పురాతనమైన మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటికనే నిదర్శనంగా నిలుస్తున్నది. రూ.3కోట్లతో సకల వసతులతో అభివృద్ధి చేసిన ఈ వైకుంఠధామాన్ని బుధవారం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది.
కరీంనగర్‌లోని శ్మశాన వాటికలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న పట్టణ ప్రగతి నిధుల్లో తప్పనిసరిగా శ్మశాన వాటికల అభివృద్ధికి కేటాయించాలన్న ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు వాటికల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు నగరంలో రూ.11 కోట్లతో 20కి పైగా వాటికల అభివృద్ధికి ప్రతిపాదనలు చేపట్టి చర్యలు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే సగానికి పైగా వాటికల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 60 శాతం మేరకు పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే, నగరంలోని పురాతనమైన మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.3 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయగా, వాటికను మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రారంభించబోతున్నారు.
సకల సదుపాయాలు
మానేరు నదీ తీరంలోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ఇందులో 3 దహన వాటికలు, రెండు స్నానపు గదులు, మూడు కర్మకాండ గదులు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. రుద్రభూమిగా చూసే ఈ వాటికల్లో శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అలాగే, అంత్యక్రియలకు వచ్చే వారు కూర్చునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. వాటికలో నడిచేందుకు టైల్స్, పేపర్బ్లాక్స్తో రోడ్లు నిర్మించారు. అలాగే, ఇతర సదుపాయాలు కూడా కల్పించారు. పూర్తిస్థాయిలో నీటి సదుపాయం కూడా అందిస్తున్నారు.
నేడు ప్రారంభోత్సవం
సకల హంగులతో సిద్ధమైన హిందూ శ్మశాన వాటికను అందుబాటులోకి తెచ్చేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. శ్మశాన వాటికతో పాటుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఇతర వాటికలను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఆయా పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.