శంకరపట్నం, ఫిబ్రవరి 22: పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా మంగళవారం ఆముదాలపల్లి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం అధికారులు, తల్లులకు పలు సూచనలు చేశారు. రక్త హీనత తలెత్తకుండా గర్భిణులు, కిశోర బాలికలు సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు బరువు చూడాలని తెలిపారు. వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో ప్రతి మంగళవారం చూసుకోవాలని చెప్పారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సూపర్వైజర్లు ప్రత్యేక శ్రద్ధచూపుతూ బరువు తక్కువున్న వారికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరల ఆవశ్యకతను వివరించాలని పేర్కొన్నారు. అంతకు ముందు మెట్పల్లి గ్రామంలో ఏసీ వైకుంఠధామం, వన నర్సరీ, కంపోస్ట్ షెడ్డు, పల్లె ప్రకృతివనంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు తీసుకుని వారితో ముచ్చటించారు. బాగా చదివి వృద్ధిలోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలతారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీవో సురేందర్, సర్పంచులు వంగల సరోజన, బత్తుల మానస, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, సీడీపీవో సబితాకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ, ఉప సర్పంచులు కనబోయిన జంపయ్య, తోట సంపత్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.