కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో పని చేస్తున్న నిర్బంధ కార్మికుల (బాండెడ్ లేబర్)కు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్బంధ కార్మికులపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి అడ్వాన్స్ ఇచ్చి తీసుకువచ్చే నిర్బంధ కార్మికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. నిర్బంధ కార్మికులు ఇటుక బట్టీలు, గ్రానైట్ పరిశ్రమలు, హోటళ్లు, రైస్‌మిల్లులు, డెయిరీ ఫాంలలో, వరి నాట్లు వేసే కూలీలుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. వారికి యజమానులు సౌకర్యాలు కల్పించేలా చూడాలని ఆదేశించారు. నిర్బంధ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇప్పించాలని సూచించారు. రిస్కు గురయ్యే మహిళలకు తగిన పరిహారం అందించాలన్నారు. కార్మికులకు యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలను తరచూ పర్యవేక్షించాలని, వారి హకులను కాపాడేలా కృషి చేయాలని సంబంధిత ఎన్జీవోలకు, అధికారులకు సూచించారు.
దినసరి కార్మికులకు వేతన పెంపు చేయాలి
ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో పనిచేసే దినసరి కార్మికులకు ఏడాదికి 10 శాతం చొప్పున వేతనాలు పెంచాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దినసరి కార్మికుల వేతనాల పెంపుపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే అన్ సిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుతం అందజేస్తున్న వేతనాలకు అదనంగా 15 శాతం పెంచి ఈ ఏడాది నుంచి ఇవ్వాలని జిల్లా కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వర్లు, విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ జీ కొమురయ్య, తెలంగాణ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీరాం, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ సంపత్, డీసీపీవో శాంత, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఎస్ఈ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నతానియేల్, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు.