గంభీరావుపేట, ఫిబ్రవరి 22: ఖాతాదారుల సంక్షేమమే లక్ష్యంగా కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంక్ పని చేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. ఖాతాదారులకు స్వయం ఉపాధితో పాటు వివిధ రుణాలను మంజూరు చేస్తూ కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా మెరుగైన సేవలందిస్తూ వారి మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గంభీరావుపేట శాఖ ద్వారా ఖాతాదారులకు ఉన్నత విద్య, ఇంటి నిర్మాణం, స్వయం ఉపాధి, ల్యాండ్ డెవలప్మెంట్, తదితర వాటికి ఇటీవల రూ. 2కోట్ల 29 లక్షల 65 వేల రుణాలు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఏడాది పాటు నిరంతరంగా పారదర్శకతతో సహకార బ్యాంకు అందిస్తున్న రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకుని సకాలంలో తిరిగి చెల్లించాలని కొండూరి కోరారు. ఖాతాదారులు, సిబ్బంది కృషితో 2010 సంవత్సరానికి ముందు రూ.80 కోట్ల నష్టాల్లో ఉన్న జిల్లా బ్యాంకును నేడు లాభాల బాటలో నడిపిస్తున్నామని, వ్యవసాయానికే కాకుండా స్వయం ఉపాధి పొందాలన్న లక్ష్యంతో వారికి వివిధ రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్ ద్వారా మంజూరైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు రవీందర్రావు అందజేశారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో నాబార్డు సౌజన్యంతో చేపట్టిన గోదాం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ముద్దం శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో సందుపట్ల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, జడ్పీ కోఆప్షన్ అహ్మద్, ఏఎంసీ డైరెక్టర్ జంగంపల్లి శేఖర్‌గౌడ్, నేతలు మహబూబ్అలీ, వెంకటియాదవ్, గంద్యాడపు రాజు, రాజనర్సు, కమ్మరి రాజారాం, నాగారపు దేవేందర్, లింగంయాదవ్, దోసల రాజు, అభిలాష్, శ్రీనివాస్‌గౌడ్, చిట్టంపల్లి భిక్షపతి లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.