కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీ అంటే ప్రజల సొమ్ము. 1956లో స్థాపించిన ఈ సంస్థ నమ్మకానికి, విశ్వాసానికి, భద్రతకు పెట్టింది పేరు. ఇందులో పాలసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. క్లయిమ్స్ విషయంలో ప్రపంచంలోనే ఉత్తమ సేవలందిస్తున్నది. ప్రజలు చేస్తున్న పాలసీల ద్వారా రూ.లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చుకుని కేంద్రానికి రూ.వేల కోట్ల పన్నులు చెల్లిస్తోంది. సంస్థలో అతి తక్కువ పెట్టుబడులు పెట్టినా కేంద్రానికి ఎల్ఐసీ మాత్రం ఏటా రూ.వేల కోట్ల డివిడెంట్ చెల్లిస్తోంది. గతేడాది రూ.2,611 కోట్ల డివిడెంట్ చెల్లించినట్లు ఈ సం స్థ ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నా రు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల నుం చి కేంద్రం తీసుకునే అప్పుల్లో 25 శా తం ఎల్ఐసీవే. తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఇస్తున్న సంస్థ కూడా ఇదే. బుక్ వ్యాల్యూ ప్రకారంగానే దేశ వ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి కేవలం రూ.100 కోట్లయితే ప్రజల సొమ్ము ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి లాభాయక సంస్థ వాటాలను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం యత్నిస్తు న్నదని ఉద్యోగులు వాపోతున్నారు.
ఐపీవో పేరిట మరో మోసం..
బ్యాంకుల మాదిరిగా ఎల్ఐసీలో కూడా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పేరిట బీజేపీ సర్కారు ఎల్ఐసీలో 49 శాతం వాటాలను అమ్మకానికి పెడుతున్నదని ఆ సంస్థ ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. లాభాల్లో నడుస్తున్న ఈ సంస్థ వాటాలను అమ్మకానికి పెట్టడం అంటే కార్పొరేట్లకు దారులు తెరిచినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగా ఎల్ఐసీ కూడా ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుందనే ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పాలసీదారులకు ఎరలు కూడా వేస్తోంది. పాలసీదారులకు 10 శాతం, ఉద్యోగులకు 5 శాతం వాటాలు ఇస్తామనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఎల్ఐసీ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, కేంద్రం చెబుతున్న ఈ మోసపూరిత మాటలను నమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఎల్ఐసీని రక్షించుకునేందుకు ఏడాదిన్నరగా తాము ఆందోళన చేస్తున్నా కేంద్రం వైఖరిలో మార్పు కనిపించడం లేదని వాపోతున్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, క్లాస్-1 ఫెడరేషన్ అధికారుల సంఘం, ఎస్ఎఫ్ఐఎఫ్డబ్ల్యూఐ, తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
దిగ్గజ సంస్థలను తలదన్నేలా..
ఎల్ఐసీలో కేంద్రం పెట్టిన పెట్టుబడి అతి తక్కువే అంటున్నారు ఈ సంస్థ ఉద్యోగులు. 1956లో రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసీని కేంద్రం స్థాపించింది. 2011లో కేవలం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనికి ఏటా రూ.2 వేల కోట్లకుపైగా డివిడెంట్ కింద ఎల్ఐసీ చెల్లిస్తోంది. జీవిత బీమాలో ఎదరులేని శక్తిగా ఎదిగిన ఈ సంస్థకు ప్రత్యామ్నాయంగా 1999లో ప్రైవేట్ బీమా కంపెనీల స్థాపనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి 23 దిగ్గజ సంస్థలు జీవి త బీమా రంగంలోకి అడుగు పెట్టాయి. అయినా, ఎల్ఐసీని అవి తట్టుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తెచ్చి ఎల్ఐసీలో వాటాలు అడుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆది నుంచి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ సర్కారు వాటికి భారీ రాయితీలు ఇస్తున్నట్లు అనేక సందర్భాల్లో వెల్లడైందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల కేంద్రానికి ఆదాయం తగ్గడంతోనే ఎల్ఐసీపై కన్నేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎల్ఐసీ.. ప్రజల సొత్తు
ఎల్ఐసీ అంటేనే తమ సొత్తని మరో వైపు పాలసీదారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సంస్థలో వాటాలను ఏ విధంగా అమ్మకానికి పెడతారని ప్రశ్నిస్తున్నారు. 1999 నుంచి 23 ప్రైవేట్ సంస్థ లు బీమారంగంలోని అడుగు పెట్టినా తట్టుకుని నిలబడి 70 శాతం ప్రజల మన్ననలు పొందిన సంస్థగా ఇప్పటికీ గుర్తింపు ఉన్నది. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా కేవలం 5 శాతమేనని, మిగతా 95 శాతం ప్రజల వాటా అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. 5 శాతం వాటా కింద నే ఏటా రూ.2 వేల కోట్లపైగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ నుంచి డివిడెంట్ పొందుతోంది. మిగిలిన 95 శాతం వాటాలో వచ్చే లాభాలను ఎల్ఐసీ తన పాలసీదారులకు పంచుతోంది. కేంద్రం ఐపీవోను అమలు చేస్తే ప్రైవేట్ సంస్థల ప్రమేయం పెరుగుతుంది. అప్పుడు పాలసీదారులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ వచ్చే అవకాశం ఉండదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఐపీవో ద్వారా ఇపుడు 10 శాతం వాటాలు మాత్రమే అమ్మకానికి పెడతామని చెబుతున్న కేంద్ర ప్రభు త్వం క్రమంగా బ్యాంకుల మాదిరిగానే 49 శాతం వాటాలు అమ్మే ప్రయత్నంలో ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. బుక్ వ్యాల్యూ ప్రకారంగానే ఈ సంస్థ ఆస్తులు రూ.46 లక్షల కోట్లలో ఉన్నాయని, మార్కెట్ వ్యాల్యూ చూస్తే ఇంతకు నాలుగింతలు వచ్చే అవకాశం కనిపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఈ వాటాలను పప్పు బెల్లం కింద అమ్ముకోడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఆందోళనలు క్రమంగా ప్రజా ఉద్యమాలుగా మారితేగానీ ఎల్ఐసీని రక్షించుకోలేమని వాదనలు వినిపిస్తున్నాయి.
వాటాలు అమ్మితే ప్రజలకే నష్టం
జీవిత బీమా సంస్థలో వాటాలు అమ్మితే పాలసీదారులుగా ఉన్న ప్రజలకే నష్టం జరుగుతుంది. సంస్థపై విశ్వాసం కోల్పోయి ప్రజలు ఈ సంస్థలో పాలసీలు చేయలేని పరిస్థితి వస్తుం ది. మంచి లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యత్నాన్ని కేంద్రం విర మించుకోవాలి. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థను అప్పనం గా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామంటే ఇన్నా ళ్లూ కష్టపడి ఈ స్థాయికి తెచ్చిన ఉద్యోగులమైన మేం చూస్తూ ఊరుకోం. సంస్థను కాపాడుకునేందుకు ప్రజ లు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సంస్థను కాపాడాల్సింది పోయి ప్రైవేట్ వ్య క్తుల చేతుల్లో పెడతామని కేంద్రం చెప్పడాన్ని మా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏడాదిన్నరగా ఉద్యమిస్తున్నాం. ఐపీవో విధానాన్ని విరమించుకునే వరకు పోరాడతాం.
– పెనుగొండ బసవేశ్వర్, ఏఐఐఈఏ డివిజన్ బేస్ యూనిట్ కార్యదర్శి