కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 21- మాతృ భాష తల్లితో సమానమని, మాతృ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి మాతృ భాష వారికి గొప్పదన్నారు. తెలుగు భాష విశిష్టతను వివరించారు. అమ్మ ఇల్లు ఎన్జీవో సంస్థ జనగాం వారు అందజేసిన పదో తరగతి స్టడీ మెటీరియల్, ప్యాడ్స్, పెన్సిళ్లు పెన్నులు, స్కేళ్లు విద్యార్థులకు అందజేశారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు కోట లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
నగునూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రచయిత వేదిక జిల్లా అధ్యక్షుడు ‘కటె పల్క’ కవితల రచయిత కందుకు అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై మాతృభాష గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డీ శ్రీహరి, లైబ్రేరియన్ మోహన్‌రావు, తెలుగు అధ్యాపకులు సీహెచ్ కవిత, ఏ సునీత, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జీ సమత, స్టాఫ్ సెక్రటరీ కే లావణ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కోల రాం చంద్రారెడ్డి విద్యార్థులకు మాతృ భాష గొప్పతనంపై అవగాహన కల్పించారు. తల్లిని ఏవిధంగా గౌరవిస్తామో మాతృ భాషనూ అదేవిధంగా గౌరవించాలని సూచించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయురాలు కృష్ణకుమారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి , ప్రేమలత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు తాము గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్రాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఉనికి, అస్థిత్వానికి మాతృభాష ప్రతీక అన్నారు. మాతృభాషను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యతని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.