కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉచిత కరెంట్‌ను సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత కరెంట్ సరఫరాపై తహసీల్దార్లు, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 32,619 ఎస్సీ వినియోగదారులున్నారని, ఇందులో 3,669 మంది ఉచిత కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, 861 ఎస్టీ వినియోగదారులున్నారని, ఇందులో 427 మంది దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారిని గుర్తించి మీ సేవలో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, విద్యుత్‌శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
వేగంగా జారీ చేయాలి
పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ల కోసం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిశీలించి, జారీ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోతె రిజర్వాయర్ సాగునీటి ప్రాజెక్ట్‌కు సంబంధించి భూ సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. చొప్పదండి, మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాల్లో దళితబంధు లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి జాబితా అందించాలన్నారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాల వారసులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం ఆయా మండలాల్లో ప్రధాన రహదారుల వెంట సుమారు 100 ఎకరాల కోసం పట్టాదారు, అసైన్డ్ తదితర స్థలాలను సేకరించాలని తహసీల్దార్లకు సూచించారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 93 దరఖాస్తులు
ప్రజావాణికి 93 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 93 మంది సమస్యలు తెలుపుతూ అర్జీలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను వెంటనే పరిషరించేందుకు సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూకు 50, ఎస్సీ కార్పొరేషన్‌కు 11, పంచాయతీ శాఖకు ఐదు, మున్సిపల్‌కు ఐదు, ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి నాలుగు, వారధికి నాలుగు, ఇతర శాఖలకు 14 వచ్చినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో శ్రీలత, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జూవేరియా, మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి నితానియేల్, డీవైఎస్వో రాజవీరు, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, వయోజన విద్యాధికారి జయశంకర్, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.