రాంనగర్, ఫిబ్రవరి 21: నక్సల్స్ కార్యకలాపాలకు ఒకప్పుడు కేంద్రంగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్లో ప్రభుత్వం, పోలీసుల చొరవతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. జిల్లాల ఏర్పాటు, అభివృద్ధితో నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగించాలనుకున్నా ప్రజలు ఆదరించే పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా కనుమరుగైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే అడపా దడపా తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగించారు. నెల రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉండి పార్టీలో చేరేందుకు సిద్ధమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరోసారి మావోయిస్టు లింకులు బయటపడ్డాయి. గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన ఒకరు వికారాబాద్‌కు చెందిన మరో ఇద్దరితో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నట్లు గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దామరంచ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్ట్‌లకు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న నలుగురిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్చిరోలి జిల్లా బంగారంపేట గ్రామానికి చెందిన కాశీనాథ్ అలియాస్ రవి ముళ్లగావడే, సాధు లచ్చతలండితో పాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన సల్లా రాజగోపాల్, మహ్మద్ ఖాసిం సాదుల్లా పట్టుబడ్డారు. విచారణలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రానైడ్, ఇతర బాంబులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో మరోసారి కరీంనగర్ జిల్లాలో మావోయిస్ట్ లింకులు బయట పడినట్లయింది. పట్టుబడిన నిందితులు గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ప్రాంతం వాసులు కావడం, నిరంతరం గ్రానైట్ కోసం పేలుడు పదార్థాలు వినియోగించడం సర్వ సాధారణం కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో పేలుడు పదార్థాలు రావడం సర్వ సాధారణమైనప్పటికీ అనుమతులున్న వారికే విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. అయితే పట్టుబడిన పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తరలించారనే విషయంలో స్పష్ట త లేకపోవడంతో విచారణ కొనసాగుతున్నది. విక్రయాల అనుమతులున్న వారి కంటే అక్రమంగా విక్రయాలు చేసే వ్యాపారులే ఎక్కువగా ఉన్నట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.