కరీంనగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దేశంలో 1818 సంవత్సరంలోనే జీవిత బీమా కార్యక్రమాలు మొదలయ్యాయి. కోల్‌కత్తాలో దీనికి సంబంధించిన బీజాలు పడ్డాయి. సురేంద్రనాథ్ ఠాగూర్ తదుపరి కాలంలో హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని స్థాపించాడు. క్రమంగా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు బాటలు వేసింది. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తర్వాత బీమా సంస్థల సంఖ్య పెరుగడం ఆరంభమైంది. 1900 సంవత్సరం తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు దేశంలోని ప్రధాన పట్టణాల్లో పనిచేయడం మొదలు పెట్టాయి. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చే సరికి వందల సంఖ్యలో ప్రైవేట్ బీమా సంస్థలు మనుగడలో ఉన్నాయి. తర్వాత కూడా బీమా సంస్థలను క్రమబద్ధీకరించడం లేదా జాతీయం చేసే విషయంలో చర్యలు చేపట్టలేదు. ప్రైవేట్ కంపెనీల ఆధీనంలో ఉన్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇండియా, యునైటెడ్ ఇండియా, ఇండియన్ మర్కైంటైల్, జనరల్ అష్యూరెన్స్, స్వదేశీ లైఫ్, సహ్యాద్రి ఇన్సూరెన్స్ ఇలా అనేక సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాయి.
ఎల్ఐసీ ఆవిర్భావం..
కేంద్ర ప్రభుత్వం 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ 1956ను జారీ చేసింది. ఈ చట్టం ద్వారా అప్పటికి మనుగడలో ఉన్న 245 బీమా కంపెనీలతో కలిపి ఎల్ఐసీ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. సంస్థ సేవలను దేశంలోని ప్రతి గ్రామానికీ విస్తరించాలని, సాధారణ ప్రజల నుంచి మొదలుకొని అందరినీ పాలసీదారులుగా మార్చాలని నిర్ణయించింది. సంస్థ ఏటా తన లాభాల్లో ఐదు శాతం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, 95 శాతం లాభాలను పాలసీదారులకు వినియోగించాలని పేర్కొంది. అలాగే, సంస్థలోని పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం సావర్నిటీ (సార్వభౌమాధికార హామీ) గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఆది నుంచి కేంద్రానికి అండగా…
మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి నిధుల విషయంలో ఎల్ఐసీ అండగా నిలబడింది. ప్రతి పంచవర్ష ప్రణాళికకు పెద్ద మొత్తంలో పెట్టుబడులను అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు రూ.24,01,457 లక్షల కోట్లను అందించింది. అలాగే, కేంద్రం పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడికి ఇప్పటి వరకు రూ.20 వేల కోట్ల డివిడెంట్ను చెల్లించింది. 2000ల సంవత్సరంలో ఐఆర్డీఏ చట్టం ద్వారా ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆహ్వానం పలికిన కేంద్ర ప్రభుత్వం వారికి ఎలాంటి నిబంధనలనూ పెట్టలేదు. ప్రైవేట్ కంపెనీలు బీమా రంగంలోకి ప్రవేశించిన 2000 సంవత్సరం తర్వాత ఈ రెండు దశాబ్దాల కాలంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రానికి ఎల్ఐసీ అందించింది. అదే సమయంలో దాదాపు రూ.పదివేల కోట్ల డివిడెంట్ను కేంద్రానికి చెల్లించింది. లక్షన్నర మంది ఉద్యోగులకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.వేలల్లో వేతనాలు ఇస్తున్న ఈ సంస్థ, వారి ద్వారా నమ్మకమైన, క్రమానుగతమైన ఇన్‌కమ్‌ట్యాక్స్‌ను కేంద్రానికి చెల్లించేలా చూసింది. అలాగే, పాలసీలపై వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్‌ను పెద్ద ఎత్తున కేంద్రానికి చెల్లించింది. అదే ఈ రెండు దశాబ్దాల కాలంలో ప్రైవేట్ బీమా కంపెనీలు ఎలాంటి డివిడెంట్ను, పెట్టుబడులను కేంద్రానికి అందించలేకపోయాయి.
ఆకాశమంత ఎత్తుకు ఎల్ఐసీ
1956లో ప్రస్థానం మొదలు పెట్టిన ఎల్ఐసీ క్రమంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. లక్షల బ్రాంచీలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సంస్థలో 40 కోట్ల మందికి పైగా పాలసీదారులు ఉన్నారు. 130 కోట్ల దేశ జనాభాలో 80 కోట్ల మంది ఆర్థిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉన్నవారుగా భావిస్తే, అందులో యాభై శాతం మంది ఎల్ఐసీలో పాలసీదారులుగా ఉండడం గమనార్హం. రూ.31,14,496 కోట్ల లైఫ్ ఫండ్స్, రూ.31,96,214 కోట్ల ఆస్తులను ఎల్ఐసీ సంపాదించుకుంది. 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విదేశీ పెట్టుబడులతో ప్రైవేట్ బీమా కంపెనీలకు అనుమతిని ఇచ్చింది. 2000 సంవత్సరంలో ప్రైవేట్ బీమా సంస్థలు పెద్ద ఎత్తున దేశీయ మార్కెట్లోకి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందులో చాలా కంపెనీలు మూతపడిపోయాయి. ఇప్పటికీ దేశంలోని బీమా రంగం మొత్తంలో ప్రైవేట్ బీమా సంస్థలన్నీ కలిసి కనీసం పాతిక శాతం వాటాను సైతం పొందలేకపోయాయి. ఇప్పటికీ ఎల్ఐసీ 75 శాతం వాటాను కొనసాగిస్తూనే వస్తోంది. ప్రైవేట్ కంపెనీలను బీమా రంగంలోకి అనుమతించడం వల్ల ఉపాధి అవకాశాలను సైతం అనుకున్న స్థాయిలో పెంచలేకపోయారు.
ప్రైవేటీకరణ దశకు..
ఐదున్నర దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానం తర్వాత ఎల్ఐసీ ప్రైవేటీకరణ దశకు చేరింది. ఒకప్పుడు ప్రైవేట్ కంపెనీలన్నింటినీ జాతీయం చేసి, ప్రభుత్వరంగ సంస్థగా మార్చిన బీమా రంగాన్ని మళ్లీ ప్రైవేట్ వ్యవస్థల్లోకి పంపించేందుకు కేంద్రం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పెట్టుబడులను సమకూర్చుకునే పరిస్థితుల్లో ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ చేయనున్నట్లు ప్రకటించింది. పెద్ద మొత్తంలో వాటాలను విక్రయించి, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఒకేసారి సంపాదించాలని యోచిస్తోంది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ పెట్టుబడుల ఉపసంహరణతో ఎల్ఐసీలోకి ప్రైవేట్ కంపెనీలు వచ్చి చేరుతాయి. ఇవి భవిష్యత్తులో కేంద్రానికి పెట్టుబడులు, లాభాలను అందించేందుకు అంగీకరించని పరిస్థితి నెలకొంటుంది. దీని ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై, దేశ ప్రజలపై చూపుతుంది. అలాగే, ప్రైవేట్ కంపెనీలు ఎల్ఐసీలోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలసీదారులకు లభించిన సావర్నెన్సీ గ్యారెంటీ నిలిచిపోతుంది. కాలక్రమంలో ఎల్ఐసీలో వాటాలను ప్రభుత్వం ఉప సంహరించుకోవడం, ప్రైవేట్ సంస్థల వాటాలు పెరుగడం వల్ల పాలసీదారులకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఎల్ఐసీ ద్వారా పాలసీదారులు, ప్రభుత్వం పొందిన లబ్ధి భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీల పరం అవుతుంది.
పాలసీదారులతో కలిసి ఆందోళన చేస్తాం
21 ఏళ్లుగా బీమా కంపెనీలతో పోటీ పడుతూ ప్రీమియంలో 68 శాతం మార్కెట్ వాటాను, పాలసీదారుల్లో 75 శాతం వాటాను కలిగి లీడర్‌గా వెలుగొందుతోంది. రూ.38 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏకైక సంస్థ. అత్యధిక లాభాలతో 99.5 శాతం క్లెయిమ్‌లు చెల్లిస్తూ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ముందుకు పోతున్నది. అలాంటి సంస్థను ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పేరిట ప్రభుత్వం తన వాటాను షేర్ల రూపంలో అమ్ముకోడానికి ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వ విధానాలపై దేశ వ్యాప్తంగా పాలసీదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.
– రాపెల్లి శ్రీనివాస్, కార్యదర్శి, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్, (రాజన్న సిరిసిల్ల)
ఏజెంట్లకు పెనుశాపం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ ఐపీవోకి తీసుకెళ్లాలనే నిర్ణయం ఏజెంట్లకు పెనుశాపంగా మారుతది. ఏజెంట్లను సంస్థకు దూరం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ఇలా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఏజెంట్ వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టే మార్కెట్ షేర్ 65శాతం ఉంది. సంస్థకు ఏటా కోట్లాది రూపాయల లాభాన్ని తెచ్చి పెడుతున్నది మా ఏజెంట్లే. ఇప్పుడు సంస్థను ఐపీవోకు తీసుకుపోవడం, ప్రభుత్వం తన వాటా అమ్ముకోవాలనుకోవడం చాలా దారుణం. గతంలో కమీషన్ల విషయంలో ఢిల్లీలో ధర్నాలు చేసి ఎలాగైతే విజయం సాధించామో ఇప్పుడు అదే స్ఫూర్తిగా అన్ని యూనియన్లు కదలాల్సి ఉంది.
– కూకట్ల కుమారస్వామి, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్- 2 వైస్ ప్రెసిడెంట్ (కరీంనగర్)
పబ్లిక్ ఇష్యూ చేయడం మానుకోవాలి
లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ చేయడం కేంద్రం మానుకోవాలి. కోట్ల మంది పాలసీదారుల విశ్వాసం, నమ్మకాన్నీ నిలబెట్టుకుని దేశంలోనే అతిపెద్ద సంస్థగా కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనివల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. కేంద్రం ఇలాంటి నిర్ణయాలు వెంటనే మానుకొని, నష్టపోయిన సంస్థలు పురోగమించే దిశగా నిర్ణయాలు చేయాలి.
– మొగుశాల రమణారెడ్డి, ఎల్ఐసీ ఏజెంట్స్ ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ (పెద్దపల్లి)
దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే
దేశంలో అవినీతి లేని సంస్థ ఏదైనా ఉందంటే అది ఎల్ఐసీ మాత్రమే. పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు బీమా భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలందిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయినందున ఏజెంట్లు, సిబ్బంది, ఉద్యోగులు అందరూ సమష్టిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. రూ.కోట్లాది ఆస్తులను సంస్థకు కూడబెట్టారు. అత్యధిక లాభాలు ఆర్జిస్తూనే కేంద్రానికి 5 శాతం నిధులు కూడా ఇస్తున్నది. గతంలో ప్రైవేటు బీమా కంపెనీలు పేదలను నిండా ముంచినయ్. ప్రజలకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతో స్థాపించిన ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తే ప్రజల్లో నమ్మకం పోతుంది. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే అవుతుంది.
– నల్ల చంద్రమౌళి, సీనియర్ ఏజెంట్, (రాజన్న సిరిసిల్ల)
కేంద్రానివి ప్రజావ్యతిరేక చర్యలు
ఎల్ఐసీ దేశ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. నష్టాల్లో నడుస్తున్నదా? లేక పాలసీదారులకు మెరుగైన సేవలందడం లేదన్న కారణాలున్నాయా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. దొడ్డిదారిన ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ రంగ సంస్థగనుకనే ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే ప్రైవేటీకరణ తర్వాత సంస్థ మనుగడే కష్టమవుతుంది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. లేకుంటే తిరుగుబాటు చేయక తప్పదు.
– అనంతుల శివప్రసాద్, డెవలప్మెంట్ ఆఫీసర్, రాజన్న సిరిసిల్ల