– కరీంనగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/ కమాన్‌చౌరస్తా/ వీణవంక/ శంకరపట్నం/ హుజూరాబాద్‌టౌన్: రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతరకు తెరలేవనున్నది. బుధవారం నుంచి శనివారం దాకా ఉమ్మడి జిల్లాలోని సుమారు 60కి పైగా ప్రాంతాల్లో జాతర కనుల పండువగా జరగనున్నది. ఇందులో ప్రధానంగా 8 చోట్ల జాతరలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలు ఉమ్మడి జిల్లాలో మినీ మేడాలను తలపిస్తాయి. ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో మూడు రోజులపాటు జనసంద్రమవుతాయి. కోల్బెల్ట్తోపాటు నీరుకుళ్ల, కొలనూర్, గోలివాడ, రేకుర్తి, వీణవంక, కేశవపట్నం, హుజూరాబాద్ (రంగనాయకులగుట్ట)లో జరిగే ఉత్సవాలకు లక్షలాదిగా జనం పోటెత్తుతారు. ఇక్కడ అధికారిక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు కొత్తపల్లి మండలం చింతకుంట, మానకొండూర్ మండలం కొండపల్కల, దేవంపల్లి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, హుజూరాబాద్ మండలం జూపాక, జమ్మికుంట మండలం కేశవాపూర్, తనుగుల, వావిలాల, ఇల్లందకుంట మండలం వావిలాల, వీణవంక మండలం చల్లూరు, కోరుకల్, సైదాపూర్ మండల కేంద్రంలో కూడా సమ్మక్క, సారలమ్మ జాతరలు జరుగుతాయి.
రేకుర్తి జాతర
జాతర ప్రదేశం : రేకుర్తి, కరీంనగర్
ఎలా వెళ్లాలి : కరీంనగర్ బస్టాండ్ నుంచి నేరుగా ఆటోల్లో వెళ్లవచ్చు. జగిత్యాల వెళ్లే రోడ్డులో ఉంటుంది. బస్టాండ్ నుంచి 6 కిలోమీటర్ల దూరం.
విశేషాలు : జాతర సమీపంలోని రేకుర్తి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం. చుట్టూ గుట్టలు, చెట్లు ఉన్నాయి.
ఏర్పాట్లు : జాతర ప్రాంతంలో విద్యుత్, తాగునీరు, స్నానాలకు ఎస్సారెస్పీ కాలువ నీరు, షవర్ల ఏర్పాటు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతులు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు. వైద్య సదుపాయాలు కల్పించారు.
ఏర్పాట్ల కోసం కేటాయించిన నిధులు : రూ.2 కోట్లు
ప్రాముఖ్యత : సుమారు 30 ఏండ్ల నుంచి ఇకడ జాతర జరుగుతుంది.
భక్తుల అంచనా : ఇకడికి సుమారు 3.50 లక్షల నుంచి 4.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
జాతర ఇన్చార్జి(అధికారి) : మారుతి
ఈవో : రత్నాకర్ రెడ్డి
జాతర కమిటీ చైర్మన్ : పిట్టల శ్రీనివాస్.
రంగనాయకుల గుట్ట
జాతర ప్రదేశం : రంగనాయకులగుట్ట, హుజూరాబాద్
ఎలా వెళ్లాలి : హుజూరాబాద్ బస్టాండు నుంచి నేరుగా ఆటోలో వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే పెద్దపాపయ్యపల్లి మీదుగా, రాంపూర్మీదుగా, కనుకులగిద్ద మీదుగా రావచ్చు.
విశేషాలు : జాతర సమీపంలోనే శ్రీ పాటిమీది సరస్వతీ నవగ్రహ సహిత ఆంజనేయస్వామి, శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి, గుట్ట అవతలి వైపు స్వయంభూ గణపతి ఆలయాలు ఉన్నాయి. గుట్టపైన రంగనాయకులస్వామి ఆలయం ఉన్నది. చుట్టూ గుట్టలు ఉన్నాయి.
ఏర్పాట్లు : జాతర ప్రాంతంలో విద్యుత్, తాగునీరు, స్నానాలకు వ్యవసాయ బావుల నీరు, బోరింగ్ (చేతిపంపు)లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మూడు చోట్ల తాతాలిక మరుగుదొడ్లు, ఆలయం పకన ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించారు.
జాతర ప్రాముఖ్యత : సుమారు 46 సంవత్సరాల నుంచి ఇకడ జాతర జరుగుతుంది.
తల్లుల తరలింపు : పెద్దపాపయ్యపల్లిలోని చీమలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని, హుజూరాబాద్‌లోని తెనుగువాడ నుంచి సారలమ్మ తల్లిని తీసుకువస్తారు.
భక్తుల అంచనా: సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
జాతర ఇన్చార్జి అధికారి : వెంకటయ్య
జాతర కమిటీ చైర్మన్ : సురకంటి సదానందరెడ్డి.
వీణవంక జాతర
జాతర ప్రదేశం : వీణవంక మండల కేంద్రంలోని కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిని ఆనుకొని, వాగు పక్కన ఉంది.
ఎలా వెళ్లాలి : కరీంనగర్ నుంచి 39 కిలో మీటర్లు. జమ్మికుంట నుంచి 11 కిలో మీటర్ల దూరం ఉంటుంది. రెండు బస్ స్టేషన్ల నుంచి ప్రతీ అరగంటకు ఒక బస్ ఉంటుంది. ఆటోలు, ట్రాలీలు, కార్లలో రావచ్చు.
విశేషాలు : జాతర పక్కన వాగుపై చెక్‌డ్యాం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఏర్పాట్లు : క్యూలైన్లపై, తలనీలాలు ఇవ్వడానికి ప్రత్యేక తాత్కాలిక చలువ పందిళ్లు వేశారు. మహిళలు, పురుషులకు స్నానాల కోసం ప్రత్యేక గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీరు, జాతర చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండెకరాలలో భక్తుల కోసం విశ్రాంతి గదులు, రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్‌లు ఏర్పాటు చేశారు.
ప్రాముఖ్యత : సుమారు 46 ఏళ్ల నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
భక్తుల అంచనా : రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
జాతర ఇన్చార్జ్ (అధికారి) : జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య.
జాతర కమిటీ చైర్మన్ : పాడి రామకృష్ణారెడ్డి.
కేశవపట్నం జాతర
జాతర ప్రదేశం : కేశవపట్నం, శంకరపట్నం మండలం
ఎలా వెళ్లాలి : కరీంనగర్ బస్టాండ్ నుంచి కేశవపట్నం 25 కిలో మీటర్ల దూ రం. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.
విశేషాలు : పంట పొలాల మధ్య ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నానాలకు పక్కనే వాగు అనువుగా ఉంటుంది. జాతర నుంచి 5 కిమీ దూరంలోని కొత్తగట్టు గుట్టపై గల శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయం దర్శనీయ స్థలం.
జాతర ఏర్పాట్లు : జాతర ప్రాంతంలో విద్యుత్, తాగునీరు, స్నానాలకు ఏర్పాట్లు చేశారు. గద్దెలకు సమీపంలో షవర్లు, మహిళలు, పురుషులకు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతులు, వైద్య సదుపాయాలు కల్పించారు.
ప్రాముఖ్యత : 44 ఏళ్లుగా జాతర జరుగుతోంది.
భక్తుల అంచనా : లక్ష నుంచి లక్షా 25 వేల వరకు భక్తులు వస్తారని అంచనా.
జాతర అధికారి (ఈవో) : శ్రీనివాస్
జాతర కమిటీ చైర్మన్ : గుర్రం స్వామి