కార్పొరేషన్, ఫిబ్రవరి 14: నగరంలోని రేకుర్తిలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క-సారలమ్మ జాతరకు బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రూ. 1.50 కోట్లతో ఏర్పాట్లు చేశారు. సివిల్ పనులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, లైటింగ్, నీటి సదుపాయాలు, సౌండ్స్, మరుగుదొడ్లు, బారికేడ్ల ఏర్పాటు తదితర పనులు తుది దశకు చేరాయి. జాతర సందర్భంగా వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు చూపించారు. భక్తులకు గద్దెల సమీపంలో ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించారు. తలనీలాల షెడ్లు, షవర్లు, మంచినీటి నల్లాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. లైటింగ్ పనులు కూడా మంగళవారం పూర్తి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.
వాహనాల పార్కింగ్ స్థలాలు
జాతర ప్రదేశంలో గద్దెల వైపు వాహనాలు వెళ్లకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆయా రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. జగిత్యాల రోడ్డు మీదుగా వచ్చే భక్తులు రోహిణి చికెన్ సెంటర్ ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో తమ వాహనాలను నిలిపి, గద్దెల వద్దకు వెళ్లాలి. విద్యానగర్ మీదుగా రేకుర్తి నుంచి వచ్చే భక్తులకు గద్దెల వెనుక వైపు ఉన్న చెరువు స్థలంలో పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే, డివిజన్ కార్యాలయం వైపు ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, జగిత్యాల రోడ్డు, రేకుర్తి ప్రధాన రహదారి నుంచి సమ్మక్క గద్దెల వరకు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వాహనాలన్నీ ఆయా ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసి, కాలినడకన అమ్మవార్లను దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పూర్తి స్థాయిలో సదుపాయాలు
జాతరకు వచ్చే భక్తుల కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించారు. గద్దెల చుట్టూ ఫ్లోరింగ్ చేయడంతో పాటు స్వాగత తోరణం నుంచి గద్దెల వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్ల దారిని విస్తరించి ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గద్దెల వెనుక ప్రాంతంలో తలనీలాల కోసం షెడ్డు, దానిని ఆనుకొని స్నానాలు చేసేందుకు షవర్స్ ఏర్పాటు చేశారు. జాతర సమీపంలోని కాకతీయ కాల్వ ద్వారా జాతర సమయంలో నీటిని విడుదల చేయిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. కాల్వను ఆనుకొని పదుల సంఖ్యలో నల్లాలు, మొక్కలకు సంబంధించి కోళ్లు, మేకలను కోసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చెరువు స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకునే వారు నేరుగా గద్దెల వరకు వచ్చేందుకు కట్ట మీదుగా దారి సిద్ధం చేశారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రేకుర్తి సమ్మక్క జాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. జాతర ప్రదేశంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను, ఏర్పాట్లను సోమవారం ఆయన కమిషనర్ సేవ ఇస్లావత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమ్మక్క గద్దెల వద్ద విశాలంగా ఉండేలా ఫ్లోరింగ్ చేయించినట్లు తెలిపారు. తాగునీరు, వైద్య సదుపాయం, స్నానాల గదులు, షవర్స్, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. జాతరలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు మూడు షిఫ్టుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నామన్నారు. బల్దియా అధికారులకు కూడా మూడు షిఫ్టుల్లో బాధ్యతలు అప్పగించి భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులు బందోబస్తుతో పాటు జాతర ప్రదేశంలో 26 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, భూమాగౌడ్, నాయకులు తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.