హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట, ఫిబ్రవరి 14: బల్దియా బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం హుజూరాబాద్ పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కమిషనర్ సుమన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించగా, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. ఆయా సమావేశాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హుజూరాబాద్ పురపాలక సంఘం అభివృద్ధి పనులకు సంబంధించి రూ.32,97,69,000తో 2022-23 అంచనా బడ్జెట్‌ను జేఏవో జీ సంధ్యారాణి ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జమ్మికుంట మున్సిపల్‌కు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనా ఆదాయం రూ.12,61,23,000, అంచనా వ్యయం రూ.12,51,73,000తో బడ్జెట్ రూపొందించినట్లు కమిషనర్ సుమన్‌రావు వెల్లడించారు. బడ్జెట్లోని పలు అంశాలపై అధికారులు, కౌన్సిల్ సభ్యులు చర్చించారు. తర్వాత బడ్జెట్‌ను కౌన్సిల్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఆయాచోట్ల సమావేశాల్లో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
అనుమతుల్లేని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. వ్యాపారాలు చేసుకునే వారంతా ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పేరిట కమర్షియల్‌గా నిర్వహించే వాటిపై దృష్టి సారించి పన్నులు వేయాలని చెప్పారు. పన్నుల వసూళ్లు పకడ్బందీగా చేపట్టాలని, పురపాలక ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. బల్దియాకు వచ్చే బడ్జెట్లో 10శాతాన్ని హరితహారం కోసం కేటాయించాలని పేర్కొన్నారు. జమ్మికుంట వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నదని, పాలకవర్గం సమష్టి సహకారంతో ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సహకారంతోనే జమ్మికుంట అభివృద్ధి సాధ్యమని, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే పాలకవర్గం ఏకైక లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. అంతకుముందు బడ్జెట్ సమావేశానికి హాజరైన కలెక్టర్‌కు చైర్మన్ ఆధ్వర్యంలో సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించారు. హుజూరాబాద్‌లో ఇన్చార్జి ఆర్డీవో, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కమిషనర్ సీహెచ్ వెంకన్న, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఇన్చార్జి ఇంజినీర్ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జోత్స్న, ఎన్ అశ్వినిగాంధీ, మేనేజర్ కే రామ్మోహన్రాయ్, కౌన్సిలర్లు, జమ్మికుంటలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హుజూరాబాద్ ఇన్చార్జి ఆర్డీవో మయాంక్ మిట్టల్(అసిస్టెంట్ కలెక్టర్), వైస్ చైర్పర్సన్ స్వప్న, అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.