జమ్మికుంట, ఫిబ్రవరి 14: మగ్గం వర్క్ శిక్షణతో ఉపాధి పొందాలని, తద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్డు ఏజీఎం అనంత్ పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నాబార్డు సౌజన్యంతో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 15రోజులుగా ఎస్‌హెచ్‌జీ మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన 90మంది మహిళలకు సోమవారం కృషి విజ్ఞాన కేంద్రంలో మగ్గం వర్క్‌లో మార్కెటింగ్‌పై అవగాహన.. బ్యాంకు రుణాలు, తదితర అంశాలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, మగ్గం వర్క్‌తో కుటుంబానికి ఆసరాగా ఉండాలని సూచించారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తామని చెప్పారు. గ్రూపులుగా, విడివిడిగా బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు. బ్యాంకులు అందించిన రుణాల్లో సబ్సిడీ కూడా ఉంటుందని చెప్పారు. బ్యాంకు రుణాలు, సబ్సిడీలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. మహిళలు పనిచేస్తేనే కుటుంబాలు బాగుపడతాయని, ఆర్థికంగా ఎదిగే వీలుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా మహిళలకు నాబార్డు సహకారంతో ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్, మిల్లెట్స్, మగ్గం వర్క్, తదితర శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని స్పందన సేవా సొసైటీ అధ్యక్షురాలు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి తెలిపారు. ఇక్కడ బ్యాంకర్లు గోపీచంద్, డీవీఎస్ రామారావు, సాయికృష్ణ, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి, ట్రైనర్లు గౌతమి, వాణి, దేవి, ట్రైనీలు, తదితరులున్నారు.