గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల కోలాహలం మొదలైంది. ఈ నెల 16న అమ్మవార్లు గద్దెలపైకి రానుండగా, పంచాయతీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో సంయుక్తంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
తిమ్మాపూర్ మండలంలో..
తిమ్మాపూర్ మండలంలో నాలుగు గ్రామ్లాల్లో జాతర సాగనున్నది. రామకృష్ణకాలనీలో గ్రామ శివారులోని జాతర ప్రాంతానికి వాగేశ్వరి కాలేజీ సమీపంలో రాజీవ్ స్వగృహ భూముల మీదుగా లోపలికి వెళ్లాలి. జాతర సాగనున్న మూడు రోజులు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి కరీంనగర్‌తో పాటు ఎల్ఎండీ, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.కొత్తపల్లి గ్రామంలో ఏటా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. జాతర ప్రాంగణం రాజీవ్ రహదారికి ఆనుకునే ఉండడంతో ఇక్కడికి పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గద్దెల వద్ద జాతర సాగనున్నది. ఇక్కడికి పది గ్రామాల వైపు నుంచి భక్తులు వస్తారు. రాజీవ్ రహదారి నుంచి నుస్తులాపూర్ గుండా నల్లగొండ గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
వచ్చునూర్లో నిర్వహించనున్న జాతరకు చుట్టు పక్కల గ్రామాల భక్తులు వస్తారు. ఇక్కడికి గుండ్లపల్లి నుంచి వెళ్లాలి. ప్రైవేటు వాహనాలు జాతర సమయంలో అందుబాటులో ఉంటాయి. జాతర ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
గన్నేరువరం మండలంలో..
మండలంలో వన దేవతల గద్దెల వద్ద జాతరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నేరువరంలో మానేరు తీరాన గ్రామ చెరువుకు అతి సమీపంలో రెండు గుట్టల మధ్య సమ్మక్క, సారలమ్మ కొలువుదీరారు. జాతరకు వెళ్లేందుకు మండల కేంద్రం గన్నేరువరానికి కరీంనగర్ నుంచి పొత్తూరు మీదుగా, గుండ్లపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది.
మైలారంలో..
మైలారం మానేరు డ్యాం బ్యాక్ వాటర్‌కు అతి సమీపంలో జాతర ప్రాంగణం ఉండడంతో చాలా మంది భక్తులు ఇక్కడకు రావడానికి ఇష్టపడతారు. జంపన్న వాగులో మాదిరిగా మానేరు నీటిలో స్నానాలు చేసి అమ్మవార్ల దర్శించుకొంటారు. పక్కనే ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడకు చేరుకునేందుకు కరీంనగర్ నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.
ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి:అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్
సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. వన దేవతల గద్దెలతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, షవర్లు, రోడ్లు, షాపింగ్ స్థలాలను పరిశీలించి, అధికారులు, జాతర కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ సుప్రియ, తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు, జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, ఈవో శ్రీనివాస్, జాతర కమిటీ సభ్యులు, నాయకులు బొజ్జ రవి, బొజ్జ కోటిలింగం, పూజారులు సారయ్య, ఎల్లయ్య, కిష్టస్వామి తదితరులున్నారు.